త్వరలో అన్ని విషయాలు: హోంమంత్రి అనిత

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-22 08:36:47  IST  )

పాస్టర్, నటుడు అభినయ్ దర్శన్ వ్యవహారంపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. ప్రస్తుతం పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని, ఇందులో రాజకీయ కోణంపైనా పోలీసులు నిఘా పెట్టారని ఆమె తెలిపారు...

త్వరలో అన్ని విషయాలు: హోంమంత్రి అనిత
X

దిశ, వెబ్ డెస్క్: పాస్టర్, నటుడు అభినయ్ దర్శన్ వ్యవహారం(Abhinay Darshan affair)పై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) సీరియస్ అయ్యారు. ప్రస్తుతం పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని, ఇందులో రాజకీయ కోణంపైనా పోలీసులు నిఘా పెట్టారని ఆమె తెలిపారు. అమాయకపు గిరిజనులను నమ్మించి అభినయ్ దర్శన్ పాస్టర్ అవతారం ఎత్తారని అనిత మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ఏదో ఒక పెద్ద కుట్ర దాగి ఉందనే అనుమానం కలుగుతోందన్నారు. అసలు ఎలాంటి కుట్రకోణం లేకపోతే కడపకు చెందిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు జిల్లాకు రావాల్సిన అవసరం ఏముందని ఆమె ప్రశ్నించారు. అభినయ్ దర్శన్‌పై ఎక్కడా ఎలాంటి దాడి జరగకపోయినా, జరిగినట్లుగా నమ్మించే ప్రయత్నం చేశారని, ఇదంతా ఒక డ్రామా అని హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకేనా?

అభినయ్ దర్శన్‌పై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని, సమాజంలో వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆయన ప్రయత్నించారని అనిత తెలిపారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలనే దురుద్దేశంతోనే ఈ విధమైన చర్యలకు పాల్పడ్డారా అనే కోణంపై లోతుగా దర్యాప్తు జరుగుతోందన్నారు. ఈ వ్యవహారం వెనుక అసలు సూత్రధారులు ఎవరున్నారనేది త్వరలోనే పూర్తిగా బయటపడుతుందని వంగలపూడి అనిత స్పష్టం చేశారు.

నాటకాలు చెల్లవు: హోంమంత్రి

రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, ఇలాంటి నాటకాలకు తెరలేపితే సహించేదిలేదని హోం మంత్రి అనిత వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇటువంటి పప్పులు ఉడకవని, ఇలాంటి వికృత ఆలోచనలు ఇంకెవరికైనా ఉంటే వెంటనే మానుకోవాలన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అభినయ్ దర్శన్‌ను త్వరలోనే కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని హోంమంత్రి అనిత వెల్లడించారు.

Next Story