మా నిబద్ధతకు ఇదే నిదర్శనం.. ఇండియా జస్టిస్ రిపోర్టుపై హోం మంత్రి

by Thanuru Gopichand |

ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో, పటిష్టమైన పోలీసింగ్ లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలవడం కూటమి ప్రభుత్వ పాలనలో నిబద్దతకు, నిజాయితీకి నిదర్శనం అని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.

మా నిబద్ధతకు ఇదే నిదర్శనం.. ఇండియా జస్టిస్ రిపోర్టుపై హోం మంత్రి
X

దిశ డైనమిక్ బ్యూరో : ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో, పటిష్టమైన పోలీసింగ్ లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలవడం కూటమి ప్రభుత్వ పాలనలో నిబద్దతకు, నిజాయితీకి నిదర్శనం అని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఈ మేరకు ఈరోజు ఒక ట్వీట్లో ప్రకటన విడుదల చేశారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ -2025లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. 2019 - 2024 మధ్య వైసీపీ పాలనలో 5వ స్థానానికి పడిపోయిన ర్యాంకింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దార్శనికతతో రెండోస్థానానికి చేరడం సంతోషకరం అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, పోలీసింగ్, న్యాయవ్యవస్థ పనితీరు, సామాజిక, చట్టపరమైన పాలన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ర్యాంకింగ్ ఇవ్వ డం విశేషం అని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికత ద్వారా డ్రోన్ పోలీసింగ్, మహిళల రక్షణ కోసం శక్తి యాప్ తో పాటు రాష్ట్రమంతటా సీసీ కెమెరాల ఏర్పాటు వంటివి సత్ఫలితాలను ఇస్తున్నాయి అని తెలిపారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ -2025లో 6.78 స్కోర్‌తో కర్ణాటక తొలిస్థానంలో నిలవగా.. 6.32 స్కోర్‌తో ఏపీ రెండో స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణ మూడో స్థానంలో ఉంది. రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెడతామన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆశయానికి అనుగుణంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్ - ఇన్విజిబుల్ పోలీస్ నినాదంతో పనిచేస్తామని భరోసా ఇస్తున్నాము అని ఆ ప్రకటనలో వివరించారు.

తాండవ ఆయకట్టు భూములకు నీటి విడుదల

ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుతో కలిసి అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలోని తాండవ రిజర్వాయర్ ప్రాజెక్ట్ నుంచి ఆయకట్టు భూములకు హోం మంత్రి వంగలపూడి అనిత సాగునీటిని విడుదల చేశారు. అనంతరం జలహారతి ఇచ్చారు. తాండవ ఆయకట్టును గత ప్రభుత్వం పట్టించుకోకపోగా కనీసం గేట్లు కూడా మరమ్మత్తులు కూడా చేయని దుస్థితి నెలకొందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. కానీ ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో రిజర్వాయర్ గేట్లు బాగు చేయించారని తెలిపారు. రిజర్వాయర్ వల్ల సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది అన్నారు. తుని, పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాల్లో పంట పొలాలకు సాగునీరు అందించే బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నామని ఆమె పేర్కొ న్నారు. కార్యక్రమంలో తాండవ రిజర్వాయర్ ఛైర్మన్ కలక సత్యనారాయణతో పాటు ఇతర సాగునీటి సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

Next Story