అమరావతిలో భారీ అగ్నిప్రమాదం.. హోంమంత్రి అనిత సీరియస్

by Naga Rani Yarlagadda |

రాష్ట్ర రాజధాని అమరావతిలో భారీ అగ్నిప్రమాదం జరగడంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఉక్కుపరిశ్రమ కార్యక్రమాన్ని చూసి ఓర్వలేక ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా?

అమరావతిలో భారీ అగ్నిప్రమాదం.. హోంమంత్రి అనిత సీరియస్
X

దిశ, వెబ్ డెస్క్: రాజధాని అమరావతిలో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా రాయపూడి వద్ద జరిగిన భారీ అగ్నిప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాయపూడి పరిధిలోని హెచ్‌వోడీ (HOD) భవన సముదాయం సమీపంలో, ముఖ్య కార్యదర్శుల బంగ్లాల వద్ద అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీకి చెందిన భారీ పైపులు అగ్నికీలలకు ఆహుతయ్యాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు భారీగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే.. అప్పటికే మేఘా ఇంజినీరింగ్ సంస్థకు చెందిన పైపులు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. రాజధాని ప్రాంతంలో ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు వరుసగా చోటుచేసుకోవడం అనేక సందేహాలకు తావిస్తోంది.

కొద్దిరోజుల క్రితమే వెలగపూడి వద్ద ఎల్‌అండ్‌టీ (L&T) సంస్థకు చెందిన పైపులకు కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా నిప్పుపెట్టారు. గతంలో రాజధాని పనులకు ఆటంకం కలిగించేలా అరటి తోటలకు నిప్పుపెట్టిన వారే, ఇప్పుడు మళ్లీ ఈ విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెలగపూడి ఘటనపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. తాజాగా రాయపూడి ఘటనపై కూడా ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది.

రాష్ట్ర రాజధాని అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలు జరగడంపై హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. రాజధానికి వ్యతిరేకంగా ఎవరు కుట్రలు పన్నినా సహించేది లేదన్నారు. అగ్నిప్రమాదాల వెనుక ఉన్నదెవరైనా కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. గత అర్థరాత్రి రాయపూడిలో జరిగిన అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తు జరిగినట్లుగా లేదన్నారు. ఇటీవల కలెక్టర్ల సదస్సు జరిగిన రోజున కూడా ఇలాంటి ప్రమాదమే జరిగిందన్నారు. వర్షాలు కురుస్తున్న సమయంలో ఇలాంటి అగ్నిప్రమాదాలు జరగడం అసాధారణమని ఆమె తెలిపారు. అనకాపల్లిలో ఆర్సెలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమకు భూమిపూజ ఘనంగా జరగడం ఓర్వలేకనే రాజధానిలో పైపులకు నిప్పు పెట్టారా? అన్న అనుమానాలు వస్తున్నాయన్నారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు జరిగిన దాఖలాలు ఉన్నాయన్నారు. పోలీస్ శాఖ అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తోందని, దీనివెనుక ఉన్నదెవరైనా ఉపేక్షించేది లేదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.

Next Story