గోరంట్ల మాధవ్‌పై హోంమంత్రి సీరియస్.. మరిన్ని చర్యలపై ఫోకస్

by Vemula.Srinu Prasad |

గత ఐదేళ్లలో పోలీస్ శాఖలో జగన్ ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదని హోంమంత్రి అనిత అన్నారు..

గోరంట్ల మాధవ్‌పై హోంమంత్రి సీరియస్.. మరిన్ని చర్యలపై ఫోకస్
X

దిశ, వెబ్ డెస్క్: గత ఐదేళ్లలో పోలీస్ శాఖలో జగన్ ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదని హోంమంత్రి అనిత అన్నారు. గుంటూరు రేంజ్ పరిధిలో పోలీసు న్నతాధికారులతో హోంమంత్రి అనిత గుంటూరులోని పోలీస్ కార్యాలయం వేదికగా సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ మంత్రి రోజా వంటి వైసీపీ నాయకుల అసభ్యకర వ్యాఖ్యలు, విమర్శల తీరు వారి సంస్కారానికి నిదర్శనమన్నారు. వైసీపీ నాయకులు పోలీసులను కూడా బెదిరించి అప్పర్ హ్యాండ్ తీసుకోవాలనుకుంటున్నారని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను ఉద్దేశించి హోంమంత్రి మండిపడ్డారు. గోరంట్ల మాధవ్ విషయంలో పోలీసుల పొరపాటు ఉందని తేలినందునే సస్పెన్షన్ చేసినట్లు స్పష్టం చేశారు. వైసీపీ చర్యలకు కాలం సమాధానం చెబుతుందన్నారు. చట్టప్రకారం శిక్షించడంపై మరింత దృష్టి సారిస్తామని అనిత తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 30 ఫోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చేశామని చెప్పారు. ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసులు తమ కర్తవ్యం నిర్వహిస్తున్నారన్నారు. హైకోర్టు, రాజధాని, సచివాలయం, రాజకీయ పార్టీ కార్యాలయాలు, నాయకుల నివాసాల నేపథ్యంలో గుంటూరులో మరింత భద్రత పెంచడంపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ల ఆధునికీరణపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు. కొత్తగా 10 పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపాదనలు వచ్చాయని వాటి ఏర్పాటు దిశగా ముందుకెళతామని హోంమంత్రి అనిత వెల్లడించారు.

వైసీపీ పాలనలో సీసీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టం, బాడీ వార్న్ కెమెరా వ్యవస్థల విధ్వంసం జరిగిందని హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.10-12 కోట్లు ఖర్చు పెట్టి ఆ విభాగాలకు తిరిగి ఊపిరి పోసిందన్నారు. సీసీ కెమెరాల ద్వారా 70 శాతం కేసులలో నిందితులను పట్టుకోవడం జరిగిందన్నారు. టెక్నాలజీ, వసతుల కల్పన ద్వారా పోలీసుల్లో కొత్త ఉత్తేజం నిండిందన్నారు. ఎస్పీ పరిధిలో ప్రతి జిల్లాలో 5-10వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయవలసిందిగా లక్ష్యం నిర్దేశించుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. నిందితులను పసిగట్టడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఇళ్లు, దుకాణాలు, ప్రైవేట్ పాఠశాలల వద్ద కూడా స్వచ్ఛందంగా సీసీలను ఏర్పాటు చేసుకోవాలని హోంమంత్రి పిలుపునిచ్చారు. డ్రోన్ వస్తే పేకాట రాయుళ్ళు, తాగుబోతులు,మోసగాళ్లు భయపడి పారిపోయే పరిస్థితిలో పోలీసులు పని చేస్తున్నారన్నారు. కోటప్పకొండలో అంత రద్దీ సమయంలో కూడా డ్రోన్ వల్లే ఎక్కడా చిన్న ఇబ్బంది రాకుండా పటిష్ట నిఘా పెట్టడం సాధ్యమైందన్నారు. బాపట్లలో 16 కిలోమీటర్ల పరిధిలో బీచ్, తీర ప్రాంతం నేపథ్యంలో పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా వీకెండ్‌లో పటిష్ట నిఘా పెట్టామన్నారు. అక్కడి గజ ఈతగాళ్లను గుర్తించి ఎస్డీఆర్ఎఫ్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పించి రెస్క్యూలో మరిన్ని మెళకువలు నేర్పించి భద్రతను పెంచుతామన్నారు. బాధితులకు న్యాయం చేయడం,నేర విచారణలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.

Next Story