సోషల్ మీడియా ట్రోలింగ్‌పై హోంమంత్రి అనిత కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం, అనుచిత కామెంట్లు, ట్రోలింగ్‌లపై రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ..

సోషల్ మీడియా ట్రోలింగ్‌పై హోంమంత్రి అనిత కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం, అనుచిత కామెంట్లు, ట్రోలింగ్‌లపై రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ వేదికగా కొందరు పరిధులు దాటి ప్రవర్తిస్తున్నారని, బాధితులు తీవ్రమైన మానసిక వేదనను అనుభవిస్తున్నారని ఆమె ఆందోళన చెందారు. ఈ తరహా వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, క్షేత్రస్థాయిలో గట్టి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోందని, ఇందులో భాగంగా ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

రంగంలోకి ప్రత్యేక 'టాస్క్ ఫోర్స్'

ఆన్‌లైన్ వేధింపులపై వేగంగా స్పందించి చర్యలు తీసుకునేందుకు మంత్రుల బృందంతో పాటు, ఒక ప్రత్యేక 'టాస్క్ ఫోర్స్'ను రంగంలోకి దింపుతున్నట్లు హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలను మరింత కఠినతరం చేయడంతో పాటు, అవసరమైతే కొత్త చట్టాల రూపకల్పన కోసం కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులు తప్పించుకోకుండా, కఠినమైన శిక్షలు పడేలా నిబంధనలను సవరించే యోచనలో ఉన్నట్లు హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.

వ్యక్తిత్వ హననాన్ని సహించం

సోషల్ మీడియాలో మహిళలు, ప్రజాప్రతినిధులు లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వ్యక్తిత్వ హననాన్ని సహించబోమని అనిత హెచ్చరించారు. చాలా మంది ఇతరుల ప్రతిష్టను దెబ్బతీయడమే ధ్యేయంగా నకిలీ ప్రొఫైళ్లు క్రియేట్ చేసి పోస్టులు పెడుతున్నారని ఆమె గుర్తు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇలాంటి ఐపీ అడ్రస్‌లను ట్రేస్ చేస్తామని, తెర వెనుక ఉండి నడిపించే సూత్రధారులను సైతం వదిలిపెట్టబోమని హోంమంత్రి అనిత హెచ్చరించారు.

Next Story