- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంజాయిపై ఉక్కుపాదం.. హోం మంత్రి అనిత
రాష్ట్రంలో గంజాయి సాగుపై కూటమి ప్రభుత్వంలో ఉక్కుపాదం మోపామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.

దిశ, డైనమిక్బ్యూరో : రాష్ట్రంలో గంజాయి సాగుపై కూటమి ప్రభుత్వంలో ఉక్కుపాదం మోపామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.శాసనమండలిలో ఇవాళ వైసీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు హోంమంత్రి సమాధానం ఇచ్చారు. గంజాయి కేసుల్లో వైసీపీ పాలనలో గతేడాది సుమారు 1,995 మందిని అరెస్ట్ చేయగా.. కూటమి ప్రభుత్వం ఆరు నెలల పాలనలోనే 2,513 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వంలో సీఎం ఇంటికి సమీపంలోనే గంజాయి మత్తులో ఓ వ్యక్తి యువతిపై అఘాయిత్యం చేసినా స్పందించలేదని, నిందితులను ఇంతవరకు పట్టుకోలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో గంజాయి సాగు 90 శాతం తగ్గిందన్నారు. డ్రోన్ వస్తే భయపడిపోయి జి.మాడుగుల మండలం ప్రాతపాడు గ్రామంలో గంజాయిని ధ్వంసం చేశారని తెలిపారు. 'ఈగల్' టాస్క్ ఫోర్స్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి సాగుకు అలవాటుపడిన 359 కుటుంబాలలో చైతన్యం కలిగించి ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించేందుకు అవగాహన కలిగించినట్లు తెలిపారు. 9 నెలల పాలనలో 3 గంజాయి కేసుల్లో ఆస్తులు జప్తు చేశామన్నారు. దేశంలో మొదటి కొకైన్ కేసు ఏపీలో 2021 జగన్ పాలనలోనే నమోదైందని గుర్తు చేశారు. కడప చుట్టుపక్కల ఇంజెక్షన్ల రూపంలో మాదకద్రవ్యాలను సేవించే 120 హాట్ స్పాట్‌లను గుర్తించి నిఘా పెట్టామన్నారు. డ్రగ్ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ సయన్వయంతో మెడికల్ షాపుల్లో దొరికే దగ్గు మందు, టాబ్లెట్ల రూపంలోని డ్రగ్స్ తీసుకునే వారికోసం డీఎడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామని హోం మంత్రి తెలిపారు.
ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో విశాఖలో అంతర్గత సమావేశం నిర్వహించనున్నట్లు హోం మంత్రి అనిత తెలిపారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం పాఠశాల స్థాయిలోనే అవగాహనకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. టీచర్లు, ప్రిన్సిపళ్ల నేతృత్వంలో ఈగల్ కమిటీలు, మెగా పేరెంట్ మీటింగ్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలీసులు, గిరిజన, వైద్య శాఖ నేతృత్వంలో ఇప్పటిదాకా 9,818 అవగాహన సదస్సులు ఇప్పటివరకూ నిర్వహించామన్నారు. గంజాయి కేసులో పట్టుబడితే కుటుంబం మొత్తానికి ప్రభుత్వ సంక్షేమం తొలగించే దిశగా సమాలోచనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
యుద్ధంలో మరణించినా, వికలాంగులైన సైనికుల ఆధారితులకు, అవివాహితులైన సోదర, సోదరిమణులకు రాష్ట్ర ప్రభుత్వంలోని ఏదైనా శాఖలో కారుణ్యనియామకం ఇస్తామని మంత్రి వెల్లడించారు. విద్యార్హతల ఆధారంగా ఆఫీస్ సబార్డినేట్, టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలిప్పించే అవకాశం ఉందన్నారు. జనవరి, 2020 నుంచి ఇప్పటివరకు కారుణ్య నియామకాల కింద వచ్చిన దరఖాస్తులు 11, ఉద్యోగాలిచ్చినవి 2, పరిశీలనలో ఉన్నవి 9 అని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోనే సైనిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, కార్పొరేషన్ కోసం ప్రత్యేకంగా ఏడాదికి రూ.10 కోట్ల నిధులు కేటాయించామని హోం మంత్రి తెలిపారు.






