అగ్రిగోల్డ్‌ బాధితులకు హోంశాఖ మంత్రి అనిత కీలక హామీ

by Ramesh Naini |

ఏపీలో అగ్రిగోల్డ్‌ బాధితులకు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత భరోసా ఇచ్చారు.

అగ్రిగోల్డ్‌ బాధితులకు హోంశాఖ మంత్రి అనిత కీలక హామీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో అగ్రిగోల్డ్‌ బాధితులకు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత భరోసా ఇచ్చారు. మంగళవారం సచివాలయంలో అగ్రిగోల్డ్ బాధితులు హోం మంత్రి అనితను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అనిత అన్నారు. బాధితులెవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని విధాలా న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు. బాధితులు నిరాశపడి ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని సూచించారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

అలాగే.. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీదుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భవానీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి అనిత తెలిపారు. మంగళవారం ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణల ఏర్పాట్లను దేవస్థానం ఉన్నతాధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ నెల 11వ తేదీన భవానీ భక్తుల దీక్ష విరమణ ప్రారంభం అవుతుంది. ఇవి 15వ తేదీ వరకు జరుగుతాయని వివరించారు. ఈ ఏడాది దాదాపు 6 లక్షల మందికి పైగా భవానీలు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు.

Next Story