రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీల దుర్మరణం.. హోంమంత్రి అనిత, మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-26 06:08:01  IST  )

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీల దుర్మరణం.. హోంమంత్రి అనిత, మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
X

దిశ,వెబ్‌డెస్క్: జాతీయ రహదారిపై ఈ రోజు(శనివారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి చెందారు. ఈ ప్రమాదం తెలంగాణలోని చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద జరిగింది. వేగంగా వెళ్తున్న లారీ ఏపీకి చెందిన పోలీసులు వెళ్తున్న కారును ఢీకొట్టడంతో డీఎస్పీ చక్రధరరావు, శాంతారావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా అడిషనల్ ఎస్పీ ప్రసాద్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి.

ఈ రోడ్డు ప్రమాద ఘటనపై ఏపీ హోం మంత్రి అనిత వెంటనే స్పందించారు. ‘‘తెలంగాణ రాష్ట్రం చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు డీఎస్పీలు చక్రధరరావు, శాంతారావు దుర్మరణం పాలవడం దిగ్భ్రాంతిని కలిగించింది. ప్రమాదంలో గాయపడిన అడిషనల్ ఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నర్సింగరావుని ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటాము. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటాం’’ అని హోంమంత్రి అనిత ట్విట్టర్ వేదికగా తెలిపారు.

అలాగే, తెలంగాణలోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీలు చక్రధరరావు, శాంతారావులు మృతి చెందడం పట్ల మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధుల్లో భాగంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకోవడం బాధాకరం అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. మృతుల కుటుంబ సభ్యులకు మంత్రులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Read More: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. సీఎం చంద్రబాబు సంతాపం

Next Story