ప్రొద్దుటూరులో హైటెన్షన్ వాతావరణం.. టీడీపీ శ్రేణుల మధ్య రాళ్లదాడి.. పోలీసుల లాఠీఛార్జ్

by Ramesh Naini |

కడప జిల్లా ప్రొద్దుటూరులో అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కింది.

ప్రొద్దుటూరులో హైటెన్షన్ వాతావరణం.. టీడీపీ శ్రేణుల మధ్య రాళ్లదాడి.. పోలీసుల లాఠీఛార్జ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కడప జిల్లా ప్రొద్దుటూరులో అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, మరో టీడీపీ నేత ప్రవీణ్ రెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు దారితీశాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది.

వివాదానికి కారణం ఇదే..

ప్రొద్దుటూరులోని ఎస్.ఎస్. షాపింగ్ మాల్ నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ టీడీపీ నేత ప్రవీణ్ రెడ్డి ఇటీవల అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ షాపింగ్ మాల్‌లో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డి భాగస్వామిగా ఉన్నారు. ప్రవీణ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అగ్నిమాపక (ఫైర్ సేఫ్టీ) అధికారులు షాపింగ్ మాల్ వద్ద తనిఖీలు చేపట్టేందుకు వచ్చారు.

ఎస్.ఎస్. మాల్ వద్ద ఉద్రిక్తత..

అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో ప్రవీణ్ అనుచరులు అక్కడికి చేరుకుని తమ వర్గీయులకు ఫోన్లు చేసి సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వర్గీయులు కూడా పెద్ద సంఖ్యలో షాపింగ్ మాల్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని, అది కాస్తా ఘర్షణకు దారితీసింది. మాటామాటా పెరగడంతో ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు రాళ్లదాడికి దిగారు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

రంగంలోకి దిగిన పోలీసులు..

ఘటనా స్థలంలో పరిస్థితి అదుపు తప్పుతుండటంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఘర్షణకు దిగిన ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనతో ప్రొద్దుటూరులో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా మోహరించి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story