మచిలీపట్నంలో హై టెన్షన్.. మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద పోలీసుల ఆంక్షలు!

by Ramesh Naini |

రామానాయుడుపేట సెంటర్‌లో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో, అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. దీంతో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని నివాసం వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మచిలీపట్నంలో హై టెన్షన్.. మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద పోలీసుల ఆంక్షలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రామానాయుడుపేట సెంటర్‌లో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో, అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. దీంతో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని నివాసం వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జెండా దిమ్మె వివాదం నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. పేర్ని నాని ఇంటిని, అక్కడే ఉన్న వైసీపీ కార్యాలయాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ మార్గంలో భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించారు. కనీసం పార్టీ కార్యాలయ సిబ్బందిని సైతం లోపలికి అనుమతించడం లేదని ఈ సందర్భంగా పోలీసుల తీరుపై పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పట్టణంలో 'సెక్షన్ 30' అమలు..

పట్టణంలో 'సెక్షన్ 30' అమలులో ఉందని పోలీసులు చెబుతుండటంపై ఆయన మండిపడ్డారు. ఈ నిబంధనలు కేవలం మాకేనా? జనసేన కార్యక్రమాలకు వర్తించవా? అంటూ పోలీసు అధికారులతో పేర్ని నాని వాగ్వివాదానికి దిగారు.

జెండా దిమ్మె వద్దకు వెళ్లే యత్నం..

రామానాయుడుపేట సెంటర్‌లో కాసేపట్లో జనసేన నేతలు పార్టీ జెండా ఆవిష్కరణకు సిద్ధమవుతున్న తరుణంలో, ఆ జెండా దిమ్మె ఉన్న ప్రాంతానికి వెళ్లేందుకు పేర్ని నాని ప్రయత్నించారు. అయితే, శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయన్న కారణంతో పోలీసులు ఆయనను మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. మరోవైపు, పేర్ని నానిని పోలీసులు అడ్డుకున్నారన్న సమాచారంతో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. జనసేన జెండా ఆవిష్కరణ వేడుకలు, ఇరు పార్టీల నేతల మధ్య వివాదం కొనసాగుతుండటంతో మచిలీపట్నంలో ఏం జరగబోతోందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story