- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పరకామణి లెక్కింపు అంశంలో హైకోర్టు కీలక ఆదేశాలు
పరకామణి లెక్కింపులో మానవ ప్రమేయాన్ని తగ్గించాలి.

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరకామణి లెక్కింపులో జరిగిన అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. శ్రీవారి కానుకల లెక్కింపు ప్రక్రియలో పారదర్శకత లోపించడం, గతంలో జరిగిన చోరీ కేసును లోక్ అదాలత్ ద్వారా హడావిడిగా రాజీ కుదుర్చుకోవడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించిన, నిందితులకు సహకరించిన పోలీసు అధికారులపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దేవాలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన వారిని ఉపేక్షించకూడదని పేర్కొంది. ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరి పాత్రపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీఐడీ, ఏసీబీ విభాగాల అధికారులను ఆదేశించింది. లెక్కింపు టేబుళ్ల ఏర్పాటు, విధివిధానాల ఖరారుపై తదుపరి స్పష్టత ఇచ్చేందుకు విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
గతంలో ఏఐ వినియోగించాలని సూచన..
పరకామణి లెక్కింపులో మానవ ప్రమేయాన్ని తగ్గించి అత్యాధునిక సాంకేతికత, కృత్రిమ మేధ (AI)ను వినియోగించేలా శాశ్వత విధివిధానాలను ఖరారు చేయాలని హైకోర్టు టీటీడీ అధికారులకు సూచించింది. ముఖ్యంగా విదేశీ కరెన్సీ గుర్తింపు, హుండీ కానుకల వర్గీకరణలో పక్కా భద్రతా చర్యలు ఉండాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రవికుమార్ మరియు అతని కుటుంబ సభ్యుల ఆస్తులపై దర్యాప్తును వేగవంతం చేయాలని, అవసరమైతే ఆదాయపు పన్ను శాఖ, ఈడీ సహాయం తీసుకోవాలని సీఐడీకి సూచించింది. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ అంశంలో పోలీసుల తీరుపై గతంలోనే అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం, ఇప్పుడు నేరుగా క్రిమినల్ చర్యలకు ఆదేశించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తదుపరి విచారణలో మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి.
Read More..
నేడు TTD పరకామణి చోరీ కేసు విచారణ.. హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ






