ఎబోలా కలకలం: ఏపీ విమానాశ్రయాల్లో హై అలర్ట్

by Vemula.Srinu Prasad |

ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ఎబోలా వైరస్ ముప్పుపై రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా స్పందించింది. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ..

ఎబోలా కలకలం: ఏపీ విమానాశ్రయాల్లో హై అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ఎబోలా వైరస్(Ebola Virus) ముప్పుపై రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా స్పందించింది. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విమానాశ్రయాల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ(Medical and Health Department ) గట్టి నిఘా ఏర్పాటు చేసింది. ప్రధానంగా ఎబోలా తీవ్రత ఎక్కువగా ఉన్న కాంగో, ఉగాండా దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు.

విమానాశ్రయాలలో హెల్త్ డెస్క్‌లు

ఇందుకోసం రాష్ట్రంలోని కీలక నగరాలైన విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాలలో ప్రత్యేక హెల్త్ డెస్క్‌లను ఏర్పాటు చేసి, వైద్య పరీక్షలను ప్రారంభించారు. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులలో ఎబోలా లక్షణాలు ఉన్నాయా లేదా అనే కోణంలో స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని ఐసోలేషన్‌కు తరలించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు.

అన్ని జిల్లాల వైద్య అధికారులకు ఆదేశాలు

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్(Minister Satyakumar) ఈ వ్యవహారంపై అన్ని జిల్లాల వైద్య అధికారులను (DMHOs) అప్రమత్తం చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దులతో పాటు విమానాశ్రయాల వద్ద నిరంతర నిఘా కొనసాగించాలని, ఎక్కడా నిర్లక్ష్యానికి తావులేకుండా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని మంత్రి సత్య కుమార్ పేర్కొన్నారు.

Next Story