ఒక్క వాట్సాప్ సందేశంతో వ్యాపారానికి సహాయం : నారా లోకేశ్

by Thanuru Gopichand |   (  Updated:2026-01-21 11:12:52  IST  )

ఏపీలో పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానాలు.

ఒక్క వాట్సాప్ సందేశంతో వ్యాపారానికి సహాయం : నారా లోకేశ్
X

దిశ, వెబ్ డెస్క్ : ​స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా అభివర్ణించారు. ​సీఎన్బీసీ-టీవీ18 (CNBC-TV18) తో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. భారతదేశానికి ఉన్న బలమైన పెట్టుబడి సామర్థ్యాన్ని, అందులో ఆంధ్రప్రదేశ్ వహించబోయే కీలక పాత్రను వివరించారు. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఇప్పటికే సుమారు 4 లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు. పెట్టుబడుల రాకతో రాష్ట్రం ఐటీ, తయారీ రంగాలలో గ్లోబల్ హబ్‌గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, ప్రపంచ పెట్టుబడిదారులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

కేవలం వాట్సాప్ మెసేజ్ దూరంలో

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అత్యంత సులభంగా అందుబాటులో ఉంటుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. జస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్ దూరంలోనే వారికి సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. రాబోయే 90 రోజుల్లో రాష్ట్రంలోని ఆక్వా, సిమెంట్, పునరుత్పాదక ఇంధనం, క్వాంటం కంప్యూటింగ్ వంటి 22 పారిశ్రామిక క్లస్టర్లలో భారీ పెట్టుబడి ప్రకటనలు వెలువడనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్‌గా మార్చడమే లక్ష్యమని లోకేశ్ స్పష్టం చేశారు.

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' వైపు అడుగులు వేస్తోందని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా వస్తున్న మొత్తం పెట్టుబడులలో ఆంధ్రప్రదేశ్ ఏకంగా 25.3 శాతం వాటాను ఆకర్షించి అగ్రస్థానంలో నిలవడం గమనార్హం అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి చట్టాల సవరణ, కార్మిక సంస్కరణలపై పని చేస్తూ పారిశ్రామికవేత్తలకు మెరుగైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని లోకేష్ పేర్కొన్నారు. క్లస్టర్ ఆధారిత అభివృద్ధి నమూనా ద్వారా పరిశ్రమల దీర్ఘకాలిక మనుగడనకు, స్థిరత్వానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇస్తోందన్నారు.

సాంకేతిక హబ్ ల నిర్మాణానికి ప్రణాళికలు

సాంకేతిక రంగంలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించబోతోందని మంత్రి నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే అమరావతిలో దేశంలోనే అతిపెద్దదైన 153-క్యూబిట్ క్వాంటం కంప్యూటర్‌ను (IBM Quantum System Two) అందుబాటులోకి తీసుకురానున్నామని ప్రకటించారు. దీనికి తోడు రాష్ట్రంలో గ్లాస్ సిటీ, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ వంటి అత్యాధునిక సాంకేతిక హబ్‌ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపారు. ప్రైవేట్ అంతరిక్ష అంకుర సంస్థ స్కైరూట్ (Skyroot) ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో తన స్పేస్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఈ అత్యాధునిక నగరాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలవనున్నాయని తెలియజేశారు.

READ MORE ....

జెరా గ్లోబల్ సీఈఓ యుకియో కానితో మంత్రి లోకేశ్ భేటీ

Next Story