నీళ్లిచ్చిన పాపానికి నరకం.. ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-03 06:27:04  IST  )

పల్నాడు జిల్లా మాచర్లలో దారుణం జరిగింది. నీళ్లు అడిగే నెపంతో ఇంట్లోకి ప్రవేశించిన ఓ కామాంధుడు, ప్రభుత్వ ఉద్యోగినిపై కత్తితో బెదిరించి ఏకంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.

నీళ్లిచ్చిన పాపానికి నరకం.. ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్: దాహమని వచ్చిన వాడికి గుక్కెడు నీళ్లు ఇవ్వబోయినందుకు ఓ ఇల్లాలికి అంతులేని అన్యాయం జరిగింది. పల్నాడు జిల్లా మాచర్లలో ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగినిపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా పెను సంచలనమే రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. సత్తెనపల్లికి చెందిన సదరు మహిళ మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, రైల్వే స్టేషన్ సమీపంలోని 13వ వార్డులో ఒంటరిగా నివసిస్తున్నారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే కావడంతో సొంతూరు వెళ్లేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. సరిగ్గా అదే సమయంలో సుమారు 50 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి ఆమె ఇంటి తలుపు కొట్టాడు. ఎండ తీవ్రంగా ఉందని, తాగడానికి కొన్ని మంచినీళ్లు కావాలని ప్రాధేయపడ్డాడు.

మానవత్వంతో ఆమె లోపలికి నీళ్లు తేవడానికి వెళ్లగా.. వెంటే దూరిన ఆ మృగాడు తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. వెంట తెచ్చుకున్న కత్తిని ఆమె మెడపై పెట్టి ప్రాణహాని తలపెడతానని బెదిరించాడు. అంతటితో ఆగక, ఆమె చున్నీతోనే కాళ్లు, చేతులు కట్టేసి క్రూరంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ కిరాతకుడు చేసిన దాడికి ఆమె స్పృహ కోల్పోయింది

విషయం బయటపడింది ఇలా..

బాధితురాలి దత్తత కుమారుడు ఆమెకు ఫోన్ చేయగా.. ఎంతకీ స్పందన రాకపోవడంతో అనుమానం వచ్చి తన స్నేహితులను ఇంటికి పంపాడు. వారు వెళ్లి చూడగా వివస్త్రగా, గాయాలతో పడి ఉన్న బాధితురాలిని చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో నరసరావుపేట ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి నిందితుడిని వెంటనే పట్టుకోవాలని ఆదేశించారు. పోలీసులు ఇప్పటికే సీసీ ఫుటేజీలను జల్లెడ పడుతున్నారు. దాహమని వచ్చిన వాడికి నీళ్లిస్తే.. ఇలాంటి ఘాతుకానికి పాల్పడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story