వామ్మో! ఇదేందయ్యా ఇది.. హైదరాబాద్ - విజయవాడ హైవేపై 70 వేల వాహనాలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-11 04:44:02  IST  )

వీకెండ్ కావడంతో.. పండక్కి ఫ్యామిలీలతో కార్లలో బయల్దేరారు. దీంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజాము నుంచి రద్దీ విపరీతంగా పెరిగింది.

వామ్మో! ఇదేందయ్యా ఇది.. హైదరాబాద్ - విజయవాడ హైవేపై 70 వేల వాహనాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : పట్నం పల్లె బాట పట్టింది. సంక్రాంతి పండక్కి సొంతూరికి వెళ్లేవారితో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయాయి. స్లీపర్ టికెట్స్ రిజర్వేషన్ చేసుకున్నా.. రైలులోకి అడుగుపెట్టే పరిస్థితి కనిపించడం లేదు. రైల్వేస్టేషన్లలో తొక్కిసలాట జరగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు హైదరాబాద్ - విజయవాడ హైవేపై భారీగా వాహనాలు వెళ్తున్నాయి. వీకెండ్ కావడంతో.. పండక్కి ఫ్యామిలీలతో కార్లలో బయల్దేరారు. దీంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజాము నుంచి రద్దీ విపరీతంగా పెరిగింది. ఏపీవైపు వెళ్లే వాహనాలు పెద్దఎత్తున తరలి రావడంతో టోల్ బూత్ ల సంఖ్యను పెంచారు. కార్లు, ఇతర వాహనాలతో హైవే రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

12 గంటల్లో 70 వేల వాహనాలు

శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకూ 70 వేల వాహనాలు టోల్ దాటి ఏపీవైపు వెళ్లినట్లు పంతంగి టోల్ ప్లాజా సిబ్బంది వెల్లడించారు. నేడు, రేపు రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. దీంతో వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్ లో ఉండకుండా ఫాస్టాగ్ స్కానింగ్ వేగంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు, టోల్ ప్రాజాల వద్ద పెట్రోలింగ్ వెహికల్స్, క్రేన్, అంబులెన్సులను అందుబాటులో ఉంచారు. ఇదిలా ఉండగా.. నందిగామ వై జంక్షన్ వద్ద రోడ్డు నిర్మాణపనులు జరుగుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెహికల్స్ నెమ్మదిగా కదులుతున్నాయి. 6 ఫ్లై ఓవర్లు నిర్మిస్తుండటం కూడా ట్రాఫిక్ కు ప్రధాన కారణమని తెలుస్తోంది. హైదరాబాద్ - విజయవాడ హైవే మార్గంలో ఫ్లై ఓవర్ల నిర్మాణం కారణంగా.. యూటర్నులు తీసుకుని మరో రూటులోకి మారే క్రమంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది.

సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజమండ్రి, కాకినాడ, భీమవరం, విశాఖపట్నం వైపు వెళ్లేవారు ట్రాఫిక్ లో చిక్కుకున్నట్లు ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఇలాగైతే భోగి రోజుకైనా ఇంటికి చేరుకుంటారా భయ్యా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నా ఈ కష్టాలు తప్పడం లేదు.

Read More..

పందెం రాయుళ్లకు షాక్.. కోడిపందేలపై హైకోర్టు కీలక ఆదేశాలు

Next Story