Heavy Rain Alert:రేపు ఈ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు

by Jakkula.Mamatha |

రాష్ట్ర ప్రజలకు మరోసారి వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.

Heavy Rain Alert:రేపు ఈ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు
X

దిశ,వెబ్‌డెస్క్:రాష్ట్ర ప్రజలకు మరోసారి వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో మరింత వేగంగా రుతుపవనాలు వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు మూడు రోజుల్లో దక్షిణ అరేబియా, మాల్దీవులు, కొమోరిన్ సహా బంగాళాశాతంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఈ క్రమంలో మధ్య మహారాష్ట్ర సహా అంతర్గత కర్ణాటక రాయలసీమ వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇక ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి కోస్తాంధ్ర రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు మరో ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో రానున్న మూడు రోజులు తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని APSDMA అంచనా వేసింది.

రేపు(మంగళవారం) తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్‌ఆర్, అన్నమయ్య, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో పాటు ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Next Story