- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాయుగుండం ఎఫెక్ట్.. అర్థరాత్రి నుంచి ఈ ప్రాంతాల్లో ఎడతెరపి లేని వర్షం
నైరుతి బగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. చెన్నై నుంచి పుదుచ్చేరి వైపు దిశ మార్చుకున్నట్లు భారత వాతావరణశాఖ తెలిపింది.

దిశ, వెబ్‌డెస్క్: నైరుతి బగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. చెన్నై నుంచి పుదుచ్చేరి వైపు దిశ మార్చుకున్నట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. బుధవారం ఉదయం లోగా ఇది తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనుందదని, దీని ప్రభావంతో నేడు ఉమ్మడి నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంది. అదేవిధంగా నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, బీఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లాల్లో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది.
దిత్వా తుపాను నేపథ్యంలో డిసెంబర్ 2 వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లొద్దన్న వాతావరణ కేంద్రం.. నేటికీ సముద్రం అలజడిగా ఉండటంతో మరో రెండ్రోజులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కృష్ణపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు పోర్టుకు మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 1వ నంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.
మంగళవారం అర్థరాత్రి నుంచి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఫలితంగా చలి పెరగడంతో ప్రజలు వణికిపోతున్నారు. మంగళవారం రాత్రి 7 గంటల వరకు తిరుపతి జిల్లా మల్లాంలో 9.6, చిట్టమూరులో 9.5, చిత్తూరు జిల్లా పాలసముద్రంలో 9.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.






