ఈ మూడు చేసి పెట్టండి: కేంద్రమంత్రికి టీడీపీ ఎంపీ రిక్వెస్ట్

by Vemula.Srinu Prasad |

ప్రజలకు రైల్వే సదుపాయాలు మెరుగుపరచాలనే సంకల్పంతో ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కలిశారు. ....

ఈ మూడు చేసి పెట్టండి: కేంద్రమంత్రికి టీడీపీ ఎంపీ రిక్వెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజలకు రైల్వే సదుపాయాలు మెరుగుపరచాలనే సంకల్పంతో ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కలిశారు. మూడు కీలక ప్రతిపాదనలు ఆయన ముందుంచారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన వినతి పత్రాన్ని సమర్పించారు.

1.పిడుగురాళ్ల - రామాయపట్నం రైల్వే లైన్

పల్నాడు ప్రాంతంలోని సిమెంట్, సున్నపురాయి, వ్యవసాయ, లాజిస్టిక్స్ రంగాలు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలంటే పోర్టుతో అనుసంధానం చాలా ముఖ్యమని కేంద్రమంత్రికి వివరించారు. అందువల్ల పిడుగురాళ్ల జంక్షన్ నుంచి రామాయపట్నం పోర్ట్ వరకు కొత్త రైల్వే లైన్ నిర్మించాలని ఎంపీ కోరారు.

2. నడికుడి, పిడుగురాళ్లలో సూపర్‌ఫాస్ట్ రైళ్ల స్టాపేజ్

ప్రస్తుతం పల్నాడు ప్రాంత ప్రజలు ప్రీమియం, వేగవంతమైన రైలు సౌకర్యం పొందడంలో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తీసుకెళ్లారు. ప్రజల సౌకర్యార్థం నడికుడి లేదా పిడుగురాళ్ల స్టేషన్లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20701): సికింద్రాబాద్ - తిరుపతి, లింగంపల్లి - విజయవాడ ఎక్స్‌ప్రెస్ (12796) రైళ్లను నిలిపి, ఇక్కడి నుండే ప్రయాణించే వెసులుబాటు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

3. విజయవాడ - బెంగళూరు వందేభారత్

నరసరావుపేట నియోజకవర్గం నుండి వేలాది మంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు నిత్యం బెంగళూరుకు ప్రయాణిస్తుంటారని, ప్రస్తుతం ఉన్న పరిమిత రవాణా సౌకర్యాల దృష్ట్యా ప్రయాణ సమయాన్ని తగ్గించి, అత్యున్నత సౌకర్యాలు కల్పించేలా విజయవాడ - బెంగళూరు ప్రాంతాల మధ్య తక్షణమే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు ప్రారంభించాలని అశ్విని వైష్ణవ్‌‌కు విన్నవించారు. అయితే ఎంపీ విన్నపాలపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.

అనంతరం శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ పల్నాడును అభివృద్ధి పథంలో నిలిపేందుకు, ప్రజలకు మెరుగైన రైల్వే సదుపాయాల కల్పనకి నా వంతు కృషికి అనునిత్యం కట్టుబడి ఉన్నానని హామీ ఇచ్చారు.

Next Story