పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ నేత పులిమి రామిరెడ్డి ధర్నా

by Vemula.Srinu Prasad |

రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్న తమపై అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ, శనివారం నాడు నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట టిడిపి నేత, పాలపాడు గ్రామానికి చెందిన పులిమి రామిరెడ్డి ఆందోళనకు దిగారు...

పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ నేత పులిమి రామిరెడ్డి ధర్నా
X

దిశ, నరసరావుపేట: రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్న తమపై అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ, శనివారం నాడు నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట టిడిపి నేత, పాలపాడు గ్రామానికి చెందిన పులిమి రామిరెడ్డి ఆందోళనకు దిగారు. స్టేషన్ ముందు బైఠాయించి పోలీసుల ఏకపక్ష వైఖరికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పులిమి రామిరెడ్డి మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల రోడ్డు కష్టాలను తీర్చేందుకు పాలపాడు నుండి అన్నవరం వరకు రోడ్డు నిర్మాణాన్ని చేపట్టామన్నారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి, రోడ్డు వెడల్పు పనులకు శ్రీకారం చుట్టగా గ్రామంలోని రైతులందరూ సహకరించారని తెలిపారు.

అయితే రాయపాటి నాగేశ్వరరావు అనే ఒకే ఒక్క రైతు మాత్రం ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. రైతులకు, ప్రజలకు ఉపయోగపడే ఈ రోడ్డు పనుల కోసం సదరు రైతు ఇంటికి వెళ్లి, ఎమ్మార్వో సమక్షంలో ఎంతో బ్రతిమిలాడామని ఆయన వివరించారు. అయినప్పటికీ, అతని కుమారుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కార్యాలయంలో తిరుగుతూ అక్కడి నుండి ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. లోకేష్ కార్యాలయం పేరు చెప్పుకుంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చి గత ఆరు నెలల్లో తనపై ఐదు అక్రమ కేసులు బనాయించారని రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ రోజు కూడా తాము ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించడానికి రూరల్ పోలీసులు నిరాకరించారని కనీసం సమాధానం కూడా చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. "మేము అధికార పార్టీలో ఉన్నామో లేదో కూడా అర్థం కావడం లేదు" అని ఆయన వ్యాఖ్యానించారు. పాలపాడులో అసలు ఏం జరుగుతుందో వాస్తవాలను తెలుసుకోవాలని మీడియా మరియు ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించాలని కోరుతూనే తాను పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు కూర్చున్నట్లు రామిరెడ్డి స్పష్టం చేశారు. ఈ నిరసనలో ఆయనతో పాటు పలువురు స్థానికులు కూడా పాల్గొన్నారు.

కాగా రామిరెడ్డి ఆరోపించిన మాజీ ప్రభుత్వ ఉద్యోగి రావిపాటి నాగేశ్వరరావు ఆ ఆరోపణలను ఖండించారు.తన అనుమతి లేకుండా తన పొలంలో రోడ్డు వేశారని, ఇదేమిటని ప్రశ్నిస్తే తాను నాయకుడ్ని కాబట్టి చెప్పింది వినాలంటాడని, ఈ విషయంపై తాను కలెక్టర్, ఎస్.పి,ఇతర అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశానన్నారు.

Next Story