కూతురి పరువుహత్య.. ఆ పోలీస్ అధికారే సూత్రధారి?

by Naga Rani Yarlagadda |

కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని తండ్రే చంపేశాడు. ఈ పరువుహత్య కేసులో అసలు సూత్రధారి పోలీస్ అధికారి అని తెలుస్తోంది.

కూతురి పరువుహత్య.. ఆ పోలీస్ అధికారే సూత్రధారి?
X

దిశ, వెబ్‌డెస్క్: తమను కాదని, కూతురు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందన్న కోపంతో ఉన్న తండ్రి.. 15 రోజుల తర్వాత ఆమెను చంపేశాడు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా.. అది ఫలించలేదు. పోస్టుమార్టంలో ఆత్మహత్య కాదని తేలడంతో పోలీసులు తండ్రే హంతకుడని విచారణలో నిర్ధారించారు. అయితే.. ఈ పరువు హత్య వెనుక ఉన్న సూత్రధారి ఓ పోలీస్ అధికారే అని తెలుస్తోంది.

ఉమ్మడి గుంటూరు జిల్లా మాచర్లలో చౌడేశ్వరి (23) గత నెల 18న తండ్రిచేతిలో దారుణ హత్యకు గురైంది. మార్చి 4న ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమించిన వ్యక్తి నాగరాజును పెళ్లిచేసుకోవడమే ఇందుకు కారణం. పెళ్లి తర్వాత నరసరావుపేటలో కాపురం పెట్టిన జంట ఆచూకీని నరసరావుపేట రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరినీ స్టేషన్ కు తీసుకెళ్లగా.. తాను మేజర్ ను అని, నాగరాజుతోనే ఉంటానని చౌడేశ్వరి చెప్పినా, ఆ అధికారి ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ తర్వాత చౌడేశ్వరి ఆత్మహత్య చేసుకుందంటూ తండ్రి కొత్త నాటకానికి తెరలేపాడు. ఆమె చనిపోయిన రోజున సదరు అధికారి సెలవులో ఉండటంతో పోస్టుమార్టం రిపోర్టు తారుమారు చేయడం కుదరలేదు. దీంతో తండ్రే హంతకుడని తేలింది. అయితే తాజాగా.. చౌడేశ్వరి హత్యకు కారణంగా భావిస్తున్న ఆ పోలీస్ అధికారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. చౌడేశ్వరిని అతను బలవంతంగా అప్పగించడంతోనే నిండుప్రాణం బలైందన్న వాదనలున్నాయి. మేజర్, పైగా పెళ్లైన కూతురిని చంపడం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.

Next Story