ఒకటిన్నర సంవత్సరంలోనే ఘనత.. పవన్‌పై నాగబాబు ప్రశంసలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-05 15:02:52  IST  )

ఒకటిన్నర సంవత్సరంలోనే పవన్ కల్యాణ్ గొప్ప ఘనత సాధించారని ఎమ్మెల్సీ నాగబాబు ప్రశంసించారు..

ఒకటిన్నర సంవత్సరంలోనే ఘనత.. పవన్‌పై నాగబాబు ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్(Andra Prq) పరుగులు పెడుతోందని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. ఎన్.ఆర్.ఐ. జనసేన శ్రేణులతో సోమవారం జరిగిన వర్చువల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం స్థిరంగా నిలబడాలనీ, కూటమిలో సర్దుబాటు కోసం కొంతమందికి త్యాగాలు చేయాల్సిన బాధ్యత ఉంటుందని తెలిపారు. ఇందుకు తాను కూడా ఒక ఉదాహరణ అని చెప్పారు. గతంలో దేశంలోనే 24వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖను పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఒకటిన్నర సంవత్సరంలోనే మొదటి స్థానంలోకి తీసుకొచ్చిన ఘనతను సొంతం చేసుకున్నారని ప్రశంసించారు. ప్రజల ధనం ప్రజల కనీస అవసరాలకు ప్రథమ ప్రాధాన్యంగా ఖర్చు చేయాలనే సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాలను, మండలాలను, జిల్లాలను అనుసంధానం చేసే రహదారుల కోసం రూ.1000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు నాగబాబు చెప్పారు.

గొప్ప నాయకుడు పవన్

గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టిన గొప్ప నాయకుడు పవన్ కల్యాణ్ అని నాగబాబు తెలిపారు. అమరజీవి జలధార ద్వారా ఐదు జిల్లాల పరిధిలో రానున్న 35 ఏళ్లలో 1.21 కోట్లమంది దాహర్తి తీర్చాలని పవన్ కల్యాణ్ సంకల్పించారని చెప్పారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీరప్రాంతం వెంబడి నివసించే మత్స్యకార సోదరులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ శాతం తీర ప్రాంతాలను కలిపేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని పేర్కొన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం అమరుడైన పొట్టి శ్రీరాములుని సదా స్మరించుకోవాలనే ఉద్దేశంతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు “అమరజీవి జలధార”గా నామకరణం చేశారని నాగబాబు స్పష్టం చేశారు.

Next Story