మేం చేసి చూపిస్తాం: మాజీ ఎమ్మెల్యేకి చదలవాడ ఛాలెంజ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-13 14:42:09  IST  )

అభివృద్ధి అంటే ఉమ్మడి కూటమి ప్రభుత్వానికే చెందుతుందని, గత వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగించిందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు విమర్శించారు...

మేం చేసి చూపిస్తాం: మాజీ ఎమ్మెల్యేకి చదలవాడ ఛాలెంజ్
X

దిశ, నరసరావుపేట ప్రతినిధి: అభివృద్ధి అంటే ఉమ్మడి కూటమి ప్రభుత్వానికే చెందుతుందని, గత వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగించిందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు విమర్శించారు. వైసిపి ఐదేండ్లలో చేయలేని అభివృద్ధిని అభివృద్ధికూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేసి చూపించిందని, దానికి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి సిగ్గుతో తలవంచుకోవాలని అన్నారు. శనివారం స్థానిక లింగంగుంట్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం పక్కన ఉన్న పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈనెల 15వ తేదీ సోమవారం ఉమ్మడి కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహించనున్న విజయోత్సవ సభకు సంబంధించి ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు షేక్ జాన్ సైదా, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు శిశు కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ మాట్లాడుతూ ఉమ్మడి కూటమి రెండేళ్ల పాలన చూసి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓర్చుకోలేకపోతున్నారని ఆరోపించారు. గత ఐదేళ్లలో వారు చేయలేని అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే చేసి చూపించిందని, దీనికి సిగ్గుతో తలవంచుకోవాలని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి పగటి కలలు కంటున్నారని, 2029 ఎన్నికల్లో కూడా నరసరావుపేట నియోజకవర్గంలో తానే ఎమ్మెల్యేగా గెలుస్తానని, రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ఐదోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జాన్ సైదా మాట్లాడుతూ ఉమ్మడి కూటమి విజయోత్సవ సభను జయప్రదం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు.

Next Story