రాష్ట్రంలో గ్యాస్, ఇంధన కొరత లేదు.. మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టీకరణ

by Ramesh Naini |

సోషల్ మీడియా వదంతుల కారణంగా ప్రజలు ఆందోళన చెంది ఒకేసారి 5 లక్షల గ్యాస్ సిలిండర్లను బుక్ చేయడం వల్లే ఇబ్బందులు తలెత్తాయని, రాష్ట్రంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి కొరతా లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో గ్యాస్, ఇంధన కొరత లేదు.. మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టీకరణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా వదంతుల కారణంగా ప్రజలు ఆందోళన చెంది ఒకేసారి 5 లక్షల గ్యాస్ సిలిండర్లను బుక్ చేయడం వల్లే ఇబ్బందులు తలెత్తాయని, రాష్ట్రంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి కొరతా లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడ కానూరులోని సివిల్ సప్లైస్ భవన్‌లో మంగళవారం ఆయిల్ డీలర్లు, అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఇంధన నిల్వలు మెరుగ్గా ఉన్నాయని, ప్రస్తుతం 17 రోజులకు సరిపడా గ్యాస్, ఆయిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు.

అక్రమాలపై కొరడా.. కొత్త బుకింగ్ నిబంధనలు

గ్యాస్ డెలివరీలో జాప్యం, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడిన 146 గ్యాస్ ఏజెన్సీలపై సెక్షన్ 6A కింద కేసులు నమోదు చేసి, 4 వేల సిలిండర్లను సీజ్ చేశామని అన్నారు. గృహ వినియోగదారులు పట్టణాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజుల తర్వాతే గ్యాస్ బుక్ చేసుకోవాలని, ఆన్‌లైన్ బుకింగ్ తర్వాత ఓటీపీ (OTP) ద్వారా మాత్రమే డెలివరీ జరుగుతుందని, ఏజెన్సీల వద్ద ప్రజలు హడావుడి చేయొద్దన్నారు. కేంద్రం 70 శాతం వరకు కమర్షియల్ గ్యాస్ సరఫరాకు అనుమతిచ్చిందన్నారు. ఆస్పత్రులు, హోటళ్లు, రెస్టారెంట్లకు ఇందులో ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. వినియోగదారులు జిల్లాల జాయింట్ కలెక్టర్ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు.

పీఎన్‌జీ (PNG) వైపు అడుగులు..

రాబోయే మూడు నెలల్లో లక్ష మంది వినియోగదారులను ఎల్‌పీజీ నుంచి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ (PNG) కి మార్చేలా లక్ష్యం పెట్టుకున్నామని, దీపం పథకం లబ్ధిదారులకు దీనిపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మంత్రి గుర్తుచేశారు. ఆయిల్ కంపెనీలతో రోజూ మాట్లాడుతూ సరఫరాను గాడిలో పెడుతున్నామని, కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు.

Next Story