జగన్ హిందూ వ్యతిరేకి.. అసెంబ్లీ చర్చకు రావాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సవాల్

by Ramesh Naini |

జగన్ ఒక ‘హిందూ వ్యతిరేకి’ అని, ఆయనకు హిందూ సంప్రదాయాల మీద గౌరవం లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు.

జగన్ హిందూ వ్యతిరేకి.. అసెంబ్లీ చర్చకు రావాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సవాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిప్పులు చెరిగారు. జగన్ ఒక ‘హిందూ వ్యతిరేకి’ అని, ఆయనకు హిందూ సంప్రదాయాల మీద గౌరవం లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం అమరావతిలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. జగన్ తీరును, వైసీపీ నేతల వైఖరిని ఎండగట్టారు. శాసనమండలిలో వైసీపీ నేతలు ప్రవర్తించిన తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలిలోకి శ్రీ వెంకటేశ్వర స్వామి ఫొటోను తీసుకొచ్చే సమయంలో వైసీపీ నేతలు చెప్పులు వేసుకుని ఉండటం ఘోరమైన అపరాధమని ఆయన పేర్కొన్నారు. కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే పవిత్రమైన భగవంతుడిని సభలోకి తెచ్చారని, ఆ సమయంలో జరిగిన పొరపాటు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తున్నా వైసీపీ నేతలు బుకాయించడం సిగ్గుచేటని మండిపడ్డారు.

తిరుమల పవిత్రతపై విమర్శలు..

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్పందిస్తూ.. గత ప్రభుత్వ హయాంలో జంతు కొవ్వుతో పాటు హానికర రసాయనాలు కలిశాయని నివేదికలే చెబుతున్నాయని మంత్రి గుర్తుచేశారు. జగన్ తన హయాంలో ఏనాడూ పవిత్ర సంప్రదాయాలను గౌరవించలేదని, శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే సమయంలో తన సతీమణితో కలిసి వెళ్లకపోవడమే దానికి నిదర్శనమని విమర్శించారు. అలాగే తిరుమలలో అన్యమతస్థులు ఇచ్చే డిక్లరేషన్‌పై సంతకం చేయడానికి జగన్ నిరాకరించడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు.

అసెంబ్లీలో చర్చకు సిద్ధమా?

జగన్ అహంకారం చూసే భగవంతుడు గతంలో ఉన్న 151 సీట్ల నుండి కేవలం 11 సీట్లకు పరిమితం చేశారని మంత్రి ఎద్దేవా చేశారు. టీటీడీ నిధులను దారి మళ్లించారని, భక్తి లేని వ్యక్తులకు పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. అనుభవం ఉన్న బొత్స సత్యనారాయణ వంటి వారు కూడా జగన్‌ను సరిదిద్దాల్సింది పోయి, ఆయన తప్పులను సమర్థించడం దారుణమన్నారు. ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటున్న జగన్, దమ్ముంటే అసెంబ్లీకి రావాలని మంత్రి సవాల్ విసురుతూ.. ‘నువ్వు అసెంబ్లీకి రా.. అక్కడ బహిరంగ చర్చకు మేము సిద్ధం’ అని పిలుపునిచ్చారు.

Next Story