కపట ప్రేమ ఒలకబోస్తున్నారు: నాటి పాలకులపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్

by Vemula.Srinu Prasad |

గత ఐదేళ్ల జగన్ అరాచక పాలనలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి, రైతాంగాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఇప్పుడు కపట ప్రేమ ఒలకబోయడం అత్యంత విడ్డూరమని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు....

కపట ప్రేమ ఒలకబోస్తున్నారు: నాటి పాలకులపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: గత ఐదేళ్ల జగన్(Jagan) అరాచక పాలనలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి, రైతాంగాన్ని(Farmers) అప్పుల ఊబిలోకి నెట్టి ఇప్పుడు కపట ప్రేమ ఒలకబోయడం అత్యంత విడ్డూరమని మంత్రి అచ్చెన్నాయుడు(Minsiter Atchannaidu) విమర్శించారు. రైతుల విషయంలో ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. రైతు భరోసా అని గొప్పలు చెప్పుకున్న వైసీపీ హయాంలో వాస్తవంగా రైతులకు ఎక్కడా భరోసా లేకుండా చేశారని మంత్రి ఆరోపించారు. సరైన సమయానికి విత్తనాలు, ఎరువులు అందించలేని చేతకానితనంతో రైతులను ఇబ్బందులకు గురిచేశారని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. నాడు మామిడి, మొక్కజొన్న రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసినా పట్టించుకోని నాటి పాలకులు.. హార్టికల్చర్ రంగాన్ని నాశనం చేసి, ఎగుమతులు తగ్గించి, మార్కెటింగ్ వ్యవస్థను కుప్పకూల్చారు. రైతులను దళారుల చేతుల్లో పెట్టేసి, కేవలం ప్రచార రాజకీయాలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.

ఇప్పటికే చర్యలు ప్రారంభించాం:

‘‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు న్యాయం జరిగేలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సమీక్షిస్తూ ముందుకు సాగుతున్నాం. మామిడి రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు, కొనుగోలు కేంద్రాలు, ధరల స్థిరీకరణపై ఇప్పటికే చర్యలు ప్రారంభించాం. మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర అందేలా అధికారులతో నిరంతరం పర్యవేక్షణ చేయిస్తున్నాం.’’ అని మంత్రి తెలిపారు.

అప్రమత్తంగా ఉన్నాం..

రైతుల సమస్యలపై తమ ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. చౌకబారు విమర్శలు, రాజకీయ డ్రామాలు కట్టిపెట్టాలని, ప్రజలన్నీ గమనిస్తున్నారని చెప్పారు. రైతుల ప్రయోజనాల కోసం, వారి సంక్షేమం కోసం ఎలాంటి కఠిన నిర్ణయాలైనా తీసుకోవడానికి తమ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

Next Story