పల్నాడు జిల్లాలో మెలియాయిడోసిస్ కలకలం

by Thanuru Gopichand |   (  Updated:2025-10-25 08:44:40  IST  )

పల్నాడు జిల్లాలో మెలియాయిడోసిస్ వ్యాధి కలకలం రేపుతోంది.

పల్నాడు జిల్లాలో మెలియాయిడోసిస్ కలకలం
X

దిశ, వెబ్ డెస్క్ : పల్నాడు జిల్లాలో మెలియాయిడోసిస్ వ్యాధి కలకలం రేపుతోంది. జిల్లాలోని వెల్దుర్తి మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవలే ఈ వ్యాధి బారినపడ్డాడు. అతను ప్రస్తుతం గుంటూరులో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా కారంపూడిలో మరో వ్యక్తి ఈ వ్యాధి బారినపడ్డాడు. మండల కేంద్రానికి చెందిన పాన్ షాప్ నిర్వాహకుడు సయ్యద్ వలీకి ఈ వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించారు. సయ్యద్ వలీ గత రెండు నెలలుగా జ్వరం, నొప్పులతో బాధపడుతూ ఉన్నాడు. అయినా తగ్గకపోవడంతో గత కొద్ది రోజుల క్రితం నరసారావుపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పరీక్షలు చేయించుకున్నాడు. వైద్య పరీక్షల్లో కిడ్నీలు, లివర్ దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో గుంటూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్ వెళ్లగా అక్కడి వైద్యులు మెలియాయిడోసిస్ వ్యాధి ఉన్నట్లుగా గుర్తించారు. అయితే వ్యాధి సోకడానికి అపరిశుభ్ర వాతావరణమే కారణమని తెలుస్తోంది.

మెలియోయిడోసిస్ అనేది బర్ఖోల్డెరియా సూడోమల్లె అనే బాక్టీరియ వల్ల కలిగే తీవ్రమైన, ప్రాణాంతక అంటు వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు. ఇది నేల, నీటిలో, ముఖ్యంగా ఆగ్నేయాసియా, ఉత్తర ఆస్ట్రేలియా వంటి ఉష్ణమండల ప్రాంతాలలో కనిపిస్తుందని అంటున్నారు. తేలికపాటి జ్వరంలా మొదలై తీవ్రమైన న్యుమోనియా, అల్సర్ల వంటి వాటికి దారి తీస్తుందని పేర్కొంటున్నారు. తద్వారా ప్రాణాంతక వ్యాధిగా పరిణమించి వ్యక్తి ప్రాణానికే ముప్పు తెస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి కలుషితమైన నేల, కలుషిత నీరు, కలుషిత ఆహారం ద్వారా వ్యాపిస్తుందని అంటున్నారు.

Next Story