- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుంటూరులో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న అగ్నికీలలు
గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులు దగ్ధం కావడంతో భారీగా ఎగసి పడుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక కాంట్రాక్టర్‌కు సంబంధించిన ఖాళీ స్థలంలో నిల్వ ఉంచిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (UGD) పైపుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్లాస్టిక్ మెటీరియల్‌తో కూడిన పైపులు కావడంతో మంటలు క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. చూస్తుండగానే అగ్నికీలలు భారీగా ఎగసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ప్రమాద తీవ్రత కారణంగా ఆ ప్రాంతంలో దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి. కిలోమీటర్ల మేర ఈ పొగ వ్యాపించడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
గంటకు పైగా ఫైరింజన్లు నిరంతరాయంగా నీటిని చల్లుతూ మంటలార్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, లోపల పైపుల నిల్వ ఎక్కువగా ఉండటంతో పొగ, మంటలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కాగా, గత పదేళ్లుగా ఈ పైపులను అదే స్థలంలో నిల్వ ఉంచినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు, అగ్నిమాపక అధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.






