- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై దారుణం.. బాధితురాలికి అండగా మహిళా కమిషన్
రైలు ప్రయాణంలో ఓ వివాహితపై జరిగిన అమానుష ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రైలు ప్రయాణంలో ఓ వివాహితపై జరిగిన అమానుష ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. భర్తతో కలిసి జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న మహిళను మాయమాటలు చెప్పి ఏసీ బోగీలోకి తీసుకెళ్లి ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది. ఈ దారుణంపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది.
రైలులో భర్త ప్రయాణిస్తున్నప్పటికీ దారుణం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన ఓ దంపతులు కొంతకాలంగా ఉపాధి నిమిత్తం విశాఖపట్నంలో నివసిస్తున్నారు. గత ఆదివారం సాయంత్రం వీరు విశాఖ ఎక్స్‌ప్రెస్‌లోని జనరల్ బోగీలో ప్రయాణం ప్రారంభించారు. ప్రయాణ సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆ మహిళను మాటల్లో దించి, నమ్మించాడు. అనంతరం ఆమెకు మాయమాటలు చెప్పి ఏసీ బోగీలోకి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఒకే రైలులో భర్త ప్రయాణిస్తున్నప్పటికీ ఈ దారుణం జరగడం గమనార్హం. ఈ ఘటన అనంతరం బాధితురాలు రెంటచింతల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
బాధితురాలికి అండగా మహిళా కమిషన్
ఈ అమానుష ఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలిసిన వెంటనే బాధిత మహిళతో ఆమె వీడియో కాల్ ద్వారా మాట్లాడి పరామర్శించారు. బాధితురాలికి మనోధైర్యం కల్పించారు. నిందితుడిని కఠినంగా శిక్షించేలా చూస్తామని, ఆమెకు పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ శైలజ మాట్లాడుతూ.. ‘విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మహిళపై జరిగిన అమానుష ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళల భద్రత విషయంలో సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలి’ అని స్పష్టం చేశారు.






