పెద్ద దస్తగిరి హత్యపై ఎంఏ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

వైఎస్ఆర్‌సీపీ హత్యా రాజకీయాలకు పరాకాష్టగా పెద్ద దస్తగిరి హత్య నిలిచిందని మైనార్టీ ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ తీవ్ర ఆరోపణలు చేశారు..

పెద్ద దస్తగిరి హత్యపై ఎంఏ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్‌సీపీ హత్యా రాజకీయాలకు పరాకాష్టగా పెద్ద దస్తగిరి హత్య నిలిచిందని మైనార్టీ ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తినే హతమార్చే స్థాయికి వైఎస్ఆర్‌సీపీ రాజకీయాలు దిగజారాయని విమర్శించారు. ఏప్రిల్ 6న జరిగిన పెద్ద దస్తగిరి హత్యను తొలుత “గంజాయి ముఠా గొడవ”గా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని, పోలీసుల విచారణ పూర్తికాకముందే సాక్షి పత్రికలో బ్యానర్ కథనాలు ప్రచురించడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. గతంలో వివేకానందరెడ్డి హత్యను గుండెపోటుగా చూపించే ప్రయత్నం చేసినట్లే, ఈ కేసును కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఇది గంజాయి ముఠా గొడవ కాదని, భూవివాదాలు మరియు భారీ స్థాయి ఆస్తి లావాదేవీలే హత్యకు కారణమని తేలిందని షరీఫ్ తెలిపారు.

దస్తగిరి నివాసంలో 150కి పైగా దస్తావేజులు లభించాయని, సుమారు రూ.500 కోట్ల విలువైన ఆస్తుల వ్యవహారాలు ఈ ఘటనకు దారితీశాయని చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి పరారీలో ఉండడం అనుమానాలకు తావిస్తున్నదని అన్నారు. హత్యకు పాల్పడిన వారే బాధితుడి వద్ద కన్నీళ్లు కార్చడం రాజకీయ నాటకమని విమర్శించారు. దస్తగిరి భార్య న్యాయం చేయాలని కోరుతున్నప్పటికీ, ఆమె పార్టీకి క్లీన్ చిట్ ఇచ్చిందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. భర్తను కోల్పోయిన మహిళ భావోద్వేగాలను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇటువంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని షరీఫ్ స్పష్టం చేశారు.

Next Story