ఐపీఎస్‌ అధికారి విశాల్‌ గున్నికి హైకోర్టులో ఎదురుదెబ్బ.. క్యాట్‌ ఉత్తర్వులపై స్టే!

by Ramesh Naini |

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సినీ నటి కాదంబరీ జత్వాని అక్రమ అరెస్ట్, అధికార దుర్వినియోగం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్‌ అధికారి విశాల్‌ గున్నికి ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

ఐపీఎస్‌ అధికారి విశాల్‌ గున్నికి హైకోర్టులో ఎదురుదెబ్బ.. క్యాట్‌ ఉత్తర్వులపై స్టే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సినీ నటి కాదంబరీ జత్వాని అక్రమ అరెస్ట్, అధికార దుర్వినియోగం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్‌ అధికారి విశాల్‌ గున్నికి ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్‌) గతంలో జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు తాజాగా నిలుపుదల (స్టే) చేసింది. ఈ వ్యవహారంపై మరింత లోతైన విచారణ అవసరమని ధర్మాసనం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ముంబై నటి కాదంబరీ జత్వానిని అక్రమంగా అరెస్టు చేశారన్న ఆరోపణలు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్ విశాల్‌ గున్నిని సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వం తనపై వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ జరిపిన క్యాట్‌.. విశాల్ గున్ని సస్పెన్షన్‌ ఉత్తర్వులను రద్దు చేయడమే కాకుండా, తక్షణమే ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వాలని గతేడాది ఆగస్టు 28న ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టులో ప్రభుత్వ అప్పీల్..

క్యాట్ ఇచ్చిన ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), రాష్ట్ర డీజీపీలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టులో వాదనలు వినిపించారు. సస్పెన్షన్ కాల పరిమితి ఇంకా ముగియక ముందే ఆ ఉత్తర్వులను క్యాట్ రద్దు చేసిందని, దీనివల్ల విచారణ ముందుకు సాగడం లేదని ఏజీ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు, విశాల్ గున్ని తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ తమ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు సుదీర్ఘంగా విన్న హైకోర్టు ధర్మాసనం.. పిటిషన్‌పై లోతైన విచారణ జరపాల్సి ఉందని పేర్కొంటూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. అనంతరం, కేసు తదుపరి విచారణను ఆగస్టు 29వ తేదీకి వాయిదా వేసింది.

Next Story