- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐటీ విప్లవం హైదరాబాద్‌దైతే.. క్వాంటం విప్లవం అమరావతిదే: మంత్రి నారా లోకేష్
నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ నగరం ఐటీ విప్లవానికి చిరునామాగా నిలిస్తే.. రాబోయే రోజుల్లో నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రపంచ 'క్వాంటం విప్లవానికి' కేంద్ర బిందువుగా మారుతుందని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో : నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ నగరం ఐటీ విప్లవానికి చిరునామాగా నిలిస్తే.. రాబోయే రోజుల్లో నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రపంచ 'క్వాంటం విప్లవానికి' కేంద్ర బిందువుగా మారుతుందని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి 'క్వాంటం టెక్నాలజీస్ హబ్'ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
చాట్ జీపీటీతో మొదలైన ప్రయాణం..
క్వాంటం టెక్నాలజీపై తనకున్న ఆసక్తిని పంచుకుంటూ లోకేష్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ‘క్వాంటం టెక్నాలజీ అంటే ఏమిటో తెలుసుకోవడానికి నేను మొదట చాట్ జీపీటీ (ChatGPT) సహాయం తీసుకున్నాను. కానీ, అప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు క్వాంటం టెక్నాలజీ భవిష్యత్తు గురించి చర్చిస్తున్నారు. సాంకేతికత అందుబాటులోకి రాకముందే దాని అవసరాన్ని గుర్తించగల అద్భుతమైన విజన్ ఆయన సొంతం’అని కొనియాడారు.
ప్రపంచంలోనే టాప్-3 'క్వాంటం వ్యాలీ'
అమరావతి కేవలం ఒక పరిపాలనా నగరం మాత్రమే కాదని, ఇది ఇన్నోవేషన్, కమ్యూనికేషన్లకు కేరాఫ్ అడ్రస్ అని లోకేష్ పేర్కొన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ మూడు క్వాంటం వ్యాలీలలో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక 'స్టార్టప్ స్టేట్' అని, అభివృద్ధి కోసం ఎంతో ఆకలితో (Hungry for growth) ఉన్నామని, అందుకే వేగంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. సెమీకండక్టర్, క్వాంటం రంగాల్లో వస్తున్న భారీ పెట్టుబడులు ఏపీ యువతకు ఉజ్వల భవిష్యత్తును కల్పిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్రానికి, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్‌కు ధన్యవాదాలు
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌కు లోకేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, అమరావతిని 'క్వాంటం వ్యాలీ'గా మార్చాలనే వినూత్న ఆలోచనను పంచుకున్న ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటికి ధన్యవాదాలు తెలియజేశారు. నాడు హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చిన చరిత్ర చంద్రబాబుది అయితే.. నేడు అమరావతిని క్వాంటం టెక్నాలజీతో గ్లోబల్ మ్యాప్‌లో నిలబెట్టే బాధ్యతను తాము తీసుకున్నామని లోకేష్ వివరించారు.






