- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి?’ : ఏపీ సర్కార్‌పై వైఎస్ జగన్ ధ్వజం
ఆంధ్రప్రదేశ్‌లో కలుషిత నీరు, కల్తీ పాలు తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కలుషిత నీరు, కల్తీ పాలు తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని విమర్శిస్తూ, ‘ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి?’ అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఆయన సుదీర్ఘంగా ట్వీట్ చేశారు.
పాలు, నీళ్లు ప్రాణాంతకమవుతున్నాయి..
సాధారణంగా మనిషి బతకడం కోసం పాలు, నీళ్లు తాగుతారని, కానీ ఏపీలో అవే ప్రాణాంతకంగా మారుతున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి పాలనలో డయేరియా, ఫుడ్ పాయిజన్ ఘటనలు నిత్యకృత్యమయ్యాయని విమర్శించారు. పరిపాలనపై పట్టు కోల్పోయిన చంద్రబాబు, ప్రతిపక్షంపై బురద చల్లడం, ‘రెడ్ బుక్’ రాజ్యాంగాన్ని అమలు చేయడంలోనే నిమగ్నమయ్యారని మండిపడ్డారు. గత 14 నెలల్లో హాస్టళ్లు, విద్యాసంస్థల్లో దాదాపు 25 చోట్ల ఫుడ్ పాయిజన్, కలుషిత నీటి ఘటనలు జరిగాయని, దీనివల్ల 15 జిల్లాల్లో 900 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. కురుపాం గిరిజన బాలికల పాఠశాలలో తాజాగా 16 మంది విద్యార్థినులు డయేరియా బారిన పడ్డారని, గతంలో ఇక్కడే ఇద్దరు విద్యార్థినులు మరణించినా ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోలేదని విమర్శించారు. గత వారమే శ్రీకాకుళంలో డయేరియాతో ఐదుగురు, రాజమహేంద్రవరంలో కల్తీ పాల వల్ల ఏడుగురు మరణించడం ప్రభుత్వ పర్యవేక్షణా లోపానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రభుత్వానికి జగన్ డిమాండ్లు..
ప్రభుత్వం ఇప్పటికైనా రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ప్రజల ప్రాణాల కోసం పని చేయాలని జగన్ సూచించారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించి, సురక్షిత నీటి సరఫరాను పునరుద్ధరించాలి. కల్తీ పాలు, ఆహారంపై పర్యవేక్షణ పెంచి ఆహార భద్రతా వ్యవస్థను బలోపేతం చేయాలి. హాస్టళ్లు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో పరిశుభ్రత ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలి.’ అని డిమాండ్ చేశారు. ‘ప్రభుత్వం నుంచి ప్రజలు అద్భుతాలేమీ కోరుకోవడం లేదు.. ప్రాణాలు పోకుండా కాపాడాలని మాత్రమే కోరుకుంటున్నారు’ అని జగన్ తన ట్వీట్‌లో స్పష్టం చేశారు.






