R5 జోన్‌పై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ

by Disha Web Desk 16 |
R5 జోన్‌పై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ
X

దిశ, వెబ్ డెస్క్: R5 జోన్‌పై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. రైతుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రధాన పిటిషన్ విచారణలో ఉండగా భూములపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అత్యవసర పిటిషన్‌గా విచారణ జరపాలని న్యాయవాదులు కోరారు. సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాగా అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు జగన్ ప్రభుత్వం మార్చి 21న నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు R5 జోన్ ఏర్పాటు చేసింది. గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అభ్యంతరాలు, సూచనలు స్వీకరించేందుకు 15 రోజులు గడువు ఇచ్చింది. దీంతో రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ చర్యలను హైకోర్టు తప్పుబట్టింది. రాజధాని కోసం తీసుకున్న భూములపై రైతులకు ఇచ్చిన హామీలు, ఒప్పందాలకు భిన్నంగా వెళ్లడం తగదని హెచ్చరించింది. విచారణ వాయిదా పడింది.

అయితే గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో ఇళ్లలేని పేదలకు అమరావతిలో ఇంటిపట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన సోమవారం జరిగిన 33వ సీఆర్డీయే అథారిటీ సమావేశంలో ఈ నిర్ణయానికి అథారిటీ ఆమోదం తెలిపింది. అమరావతిలో పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కోసం ఇళ్లస్థలాలు కేటాయిస్తూ జీవో నెం.45ను జారీ జారీ చేశారు. అమరావతిలో 1134.58 ఎకరాల భూమి పేదల ఇళ్లకోసం కేటాయింపులు జరిపినట్లు అథారిటీ స్పష్టం చేసింది. మొత్తం 20 లే అవుట్లలో స్థలాలు ఇచ్చేందుకు సీఆర్డీయే ముందుకు వచ్చింది. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 48,218 మందికి ఇళ్లపట్టాలు ఇవ్వనున్నారు. ఐనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, కూరగల్లు, నిడమానూరు ప్రాంతాల్లో ఇళ్లస్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. లబ్ధిదారుల జాబితాతో డీపీఆర్‌లు తయారు చేయాలని గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల కలెక్టర్లకు సీఆర్డీఏ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. నవరత్నాలు… పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం మూడోవిడత కింద వీరికి ఇళ్లపట్టాలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ అథారిటీ సమావేశంలో ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించేలా తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించారు. మే నెల మొదటివారం నాటికి.. పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

దీంతో రాజధాని అమరావతి ప్రాంత రైతులు మరోసారి హైకోర్టులో సవాల్ చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించింది. ఈ మేరకు అమరావతి రైతుల తరపున దాఖలనైన రెండు పిటిషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.


Next Story

Most Viewed