పొన్నూరులో విషాదం.. వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి

by Naga Rani Yarlagadda |

వీధికుక్క దాడి చేయడంతో రేబిస్ బారిన పడిన నాలుగేళ్ల బాలుడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

పొన్నూరులో విషాదం.. వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: వీధికుక్క దాడి చేయడంతో రేబిస్ బారిన పడిన నాలుగేళ్ల బాలుడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరు గ్రామానికి చెందిన తాడిశెట్టి రాజా, జ్యోతి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె సంతానం. వ్యవసాయ పనులు చేసుకుంటూ రాజా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 15 రోజుల క్రితం కొడుకు కార్తీక్ (4) ఇంటి బయట ఆడుకుంటు ఉండగా.. వీధికుక్క దాడి చేసింది. తల,చేతులపై గాయాలు కావడంతో పొన్నూరు ఆస్పత్రికి తరలించారు.

చికిత్స చేస్తుండగా.. మూడ్రోజులకు బాలుడిలో మార్పు కనిపించడంతో విజయవాడలో ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షలు చేసిన డాక్టర్లు.. బాలుడికి రేబిస్ సోకినట్లు నిర్థారించారు. అప్పటి నుంచి చికిత్స చేస్తున్నా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో.. గుంటూరు జీజీహెచ్ కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న బాలుడు.. ఆరోగ్యం మరింత విషమించి కన్నుమూశాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలుడి మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

Next Story