కల్వర్టు నుంచి నీరు లీక్.. సాగు నీటి కోసం రైతుల లబోదిబో

by Vemula.Srinu Prasad |

యన్‌ఎస్పీ కాలువ కల్వర్టు నుంచి నీరు లీక్ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు..

కల్వర్టు నుంచి నీరు లీక్.. సాగు నీటి కోసం రైతుల లబోదిబో
X

దిశ, కారంపూడి: కారంపూడి నుండి పెద్ద కోదమగుండ్ల మేజర్ యన్‌ఎస్పీ కాలువ మధ్యలో ఉన్న కల్వర్టు పూర్తిగా అధ్వాన్నంగా మారింది. దీంతో కాలువలో ప్రవహిస్తున్న సాగునీరు మధ్యలోనే భారీగా లీకేజీ అవుతోంది. దీని ప్రభావంతో చివరి భూములకు నీరు చేరక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్ల తరబడి నిర్వహణ లేకపోవడం తో ఇటీవల కురిసిన వర్షాలకు ఈ నిర్మాణం మరింత కూలిపోయింది. కల్వర్టు కాంక్రీట్ పొరలతో పాటు అంచులు కూలిపోవడం వల్ల నీరు లీక్ అవుతుందని రైతులు తెలిపారు. నీటి ప్రవాహం మధ్యలోనే లీకై పోతుండటంతో చివరి భూములకు నీరు చేరక పంటల సాగులో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు.

రైతుల ఆవేదన:

సాగునీరు రావాలంటే మొత్తం కాలువపై ఆధారపడతాం. కానీ మధ్యలోనే నీరు లీకైపోతుంది. చివరి భూములకు నీరు అందడం లేదు. అధికారులు స్పందించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. అధికారులు చర్యలు తీసుకుని కల్వర్టుకు మరమ్మతు చేయకపోతే మా భవిష్యత్తు అనిశ్చితంగా మారుతుంది.

యన్‌యస్పీ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు:

కాలువ సంరక్షణ కోసం గతంలో ఇచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు చేపట్టలేదని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. కాలువలో లీకేజీని ఆపేందుకు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల నీరు వృథాగా పోతోందని, సాగునీటి పంపిణీ తీవ్రంగా ప్రభావితమవుతోంది. సాగునీటి సరఫరాను పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు.

రైతుల పట్టుదల

అధికారుల నిర్లక్ష్యం ఉన్నప్పటికీ రైతులు తమ భూములను కాపాడుకునేందుకు ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల తాత్కాలికంగా బ్లాకులు వేసి నీటిని నిల్వ చేయడం, పరస్పర సహకారంతో నీటిని పంపిణీ చేయడం వంటి చర్యలు చేపట్టారు.

భవిష్యత్‌పై ఆందోళన

కాలువ మరమ్మతులకు తక్షణ చర్యలు తీసుకోకపోతే సాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు నీరు అందక తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని, ఇది గ్రామ తమ జీవనోపాధిని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశా. అధికారుల నిర్లక్ష్యాన్ని వీడి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.

యన్‌ఎస్పీ ఏఈ సుధాకర్ వివరణ:

దిశ పత్రిక రిపోర్టర్ వివరణ కోరగా ‘‘వాటర్ లీకేజీ అవుతుంది నిజమే. పైఅధికారులకు ఎస్టిమేట్ పంపించి కల్వర్టుకు మరమ్మతులు చేయిస్తాం. చివరి భూములకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటాం.’’ అని తెలిపారు.

Next Story