నామ్ నరేందర్.. కాం సరెండర్.. ప్రధానిపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు

by Ramesh Naini |

ప్రధాని మోడీ తీరు ‘నామ్ నరేందర్.. కాం సరెండర్’ అమెరికా చేతిలో ప్రధాని కీలుబొమ్మ అని ఏపీ కాంగ్రెస్ స్టేట్ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు.

నామ్ నరేందర్.. కాం సరెండర్.. ప్రధానిపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని మోడీ తీరు ‘నామ్ నరేందర్.. కాం సరెండర్’ అమెరికా చేతిలో ప్రధాని కీలుబొమ్మ అని ఏపీ కాంగ్రెస్ స్టేట్ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివారం ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. అమెరికాతో జరిగింది గ్రేట్ డీల్ కాదని, ఇండియాకు బ్లాక్ డీల్ అని పేర్కొన్నారు. దేశ రైతాంగానికి, పరిశ్రమల రంగానికి బ్లాక్ డే.. అగ్రరాజ్యం బ్లాక్ మెయిల్ కి తలొగ్గి దేశ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం దారుణమని మండిపడ్డారు. ఈ డీల్ దేశ భవిష్యత్ కే పొంచి ఉన్న ప్రమాదం అని హెచ్చరించారు. సున్నా సుంకాలతో భారత మార్కెట్‌ను అమెరికా ఉత్పత్తులు శాసించాయంటే స్వదేశీ ఉత్పత్తులకు ఇది మరణశాసనమేనని చెప్పుకొచ్చారు.

మోడీ చేసిన బ్లాక్ డీల్...

మోడీ చేసిన బ్లాక్ డీల్ మన రూపాయి భవితవ్యాన్ని దెబ్బతీసేలా ఉందని ఆరోపించారు. ఇండియా ఎగుమతులపై అమెరికా సుంకాలు 18 శాతం తగ్గిస్తే, ఆ దేశ దిగుమతులపై మోడీ సుంకాలు సున్నా చేయడం ఏంటి ? అని ప్రశ్నించారు. మన దేశ ఉత్పత్తులపై మొన్నటిదాకా అమెరికా వేసిన పన్నులు కేవలం 5 శాతం లోపే నని పేర్కొన్నారు. 5 నుంచి 50 శాతం పన్నులు పెంచి, అందులో 18 శాతానికి కుదిస్తే ఇండియాకు ప్రయోజనం ఎలా అవుతుంది? మన దేశానికి భారీ లాభం ఎలా చేకూరింది ? సుంకాలు తగ్గింపుతో భారత్ కి దక్కే ప్రయోజనం కంటే.. సున్నా సుంకాలతో అమెరికాకు మాత్రం 100 శాతం లాభం.. అని తెలిపారు. ఇండియా రైతులకు ఉరి పెట్టి, అమెరికా వ్యవసాయానికి మోడీ గ్రేట్ డీల్ ఇచ్చారని ఆరోపించారు. ట్రంప్ కోసం మేక్ ఇన్ ఇండియా స్లోగన్ కి మోడీ తిలోదకాలు ఇచ్చారని, రష్యా క్రూడ్ ఆయిల్ తీసుకున్నారంటే మళ్ళీ సుంకాలు 50 శాతం పెంచుతామని ట్రంప్ బహిరంగంగా అంటున్నారంటే ఇది బ్లాక్ మెయిల్ కాదా ? ట్రంప్ పెట్టిన భయానికి మోడీ బయటపడ్డారంటే సాగిలపడ్డట్లు అనిపించుకోదా ? అని ప్రశ్నించారు.

మోడీ సరెండర్ అగ్రిమెంట్‌

‘ఇరుదేశాల మధ్య సమతూకంగా చేసుకొనేవి వాణిజ్య ఒప్పందాలు. ఒక దేశానికి నష్టం, మరో దేశానికి లాభం చేసే వాటిని ఒప్పందాలు ఎలా అంటారు ? అమెరికా ప్రయోజనాల కోసం 75 ఏళ్ల వాణిజ్య ఒప్పందాల చరిత్రను మోడీ తుంగలో తొక్కారు. 50 కోట్ల వ్యవసాయ ఆధారిత కుటుంబాల కన్నా.. మోడీకి అమెరికా ప్రయోజనాలే మిన్న. ఏటా 100 బిలియన్ డాలర్ల దేశ సొమ్మును అమెరికాకు అప్పనంగా కట్టబెట్టే కుట్ర ఇది. భారత ప్రధాని విదేశం ఎదుట లొంగిపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. మోడీ వెంటనే సరెండర్ అగ్రిమెంట్‌ను బయటపెట్టాలి. సున్నా సుంకాలు విధించే రెండు మూడు వస్తువుల గురించి చెప్పడం కాదు.. అమెరికా నుంచి దిగుమతి కాబోయే అన్ని ఉత్పత్తులు, విధించే పన్నుల వివరాలు వెంటనే బయటపెట్టాలి.’ అని షర్మిల ట్వీట్‌లో పేర్కొన్నారు.

Next Story