రాత్రి స్కెచ్.. తెల్లారేసరికి ఆ ఇద్దరిని మూసేసిన అధికారులు

by Bhoopathi Nagaiah |

ప్రభుత్వం పేదలకు సరఫరా చేసే బియ్యాన్ని వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుండగా సివిల్ సప్లై అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు.

రాత్రి స్కెచ్.. తెల్లారేసరికి ఆ ఇద్దరిని మూసేసిన అధికారులు
X

దిశ, మార్టూరు: ప్రభుత్వం పేదలకు సరఫరా చేసే బియ్యాన్ని వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుండగా సివిల్ సప్లై అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. పక్కా సమాచారం అందుకున్న అధికారులు ఆదివారం తెల్లవారుజామున మార్టూరు మండలం కోనంకి వద్ద దారికాచి 80 బస్తాల పీడీఎస్ బియ్యం లోడుతో వెళ్తున్న గూడ్స్ ఆటోను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను రెవెన్యూ ఇన్స్పెక్టర్ సీహెచ్. సురేష్ బాబు మీడియాకు వెల్లడించారు.

చిలకలూరిపేట, మార్టూరు ఏరియాలో సేకరించిన పీడీఎస్ బియ్యాన్ని ఒంగోలుకు తరలిస్తుండగా సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందిందని ఆర్ఐ సురేష్ బాబు తెలిపారు. గూడ్స్ ఆటోలో 80 బస్తాల పీడీఎస్ బియ్యం ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకోని వలపర్లలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస రైస్ మిల్‌కు తరలించినట్లు చెప్పారు. ప్రభుత్వ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహన యజమాని బంగారు రాజు, డ్రైవరు వెంకటేశ్ లపై మార్టూరు పోలీస్ స్టేషన్‌లో సివిల్ సప్లై ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎ.అబ్రహం ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్ కోర్టులో 6A కేసు నమోదు చేస్తున్నట్లు ఆర్ఐ సురేష్ బాబు తెలిపారు.

ఇదిలా ఉండగా ఆదివారం రాత్రే పీడీఎస్ బియ్యం పట్టుబడ్డాయని, బియ్యం వ్యాపారికి, కొంతమంది అధికారులకు బేరసారాలు జరిగాయనే ఆరోపణలు మార్టూరులో గుప్పుమంటున్నాయి. అయితే వారిద్దరి మధ్య రేటు కుదరకపోవడంతోనే అక్రమ బియ్యం తరలింపు వ్యవహారం బయటకు పొక్కినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఆరోపణల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సివిల్ సప్లై అధికారులు స్పందించాల్సిందే.

Next Story