- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుసగా బైక్ చోరీలు.. నిందితుడి అరెస్ట్
పల్నాడు జిల్లా పోలీసు శాఖ మరోసారి చురుకైన చర్యలతో వరుస ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి, సుమారు రూ.6 లక్షల విలువైన ఎనిమిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుంది. ..

దిశ, నరసరావుపేట: పల్నాడు జిల్లా పోలీసు శాఖ మరోసారి చురుకైన చర్యలతో వరుస ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి, సుమారు రూ.6 లక్షల విలువైన ఎనిమిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుంది. పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు నరసరావుపేట 1వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన వాహన చోరీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు నిందితుడిని పట్టుకుని కేసులను ఛేదించారు.నరసరావుపేట 1వ పట్టణ సీఐ ఎస్.కె.టి. ఫిరోజ్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ పి. వంశీకృష్ణ నేతృత్వంలోని పోలీసు బృందం ముమ్మర గాలింపులు నిర్వహించింది. ఈ క్రమంలో జూలై 7న నరసరావుపేట పట్టణంలోని డి-మార్ట్ ఉత్తర భాగంలోని రహదారి మార్జిన్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అతడు ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వల్లాపల్లి గ్రామానికి చెందిన షేక్ షబ్బీర్ (26)గా గుర్తించారు. పోలీసుల విచారణలో నిందితుడు నరసరావుపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో వివిధ సందర్భాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు అంగీకరించాడు. అనంతరం అతడు చూపించిన ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించగా మొత్తం ఎనిమిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇవన్నీ నరసరావుపేట 1వ పట్టణ పోలీసు స్టేషన్‌లో నమోదైన వాహన చోరీ కేసులకు సంబంధించినవేనని పోలీసులు నిర్ధారించారు.స్వాధీనం చేసుకున్న వాహనాల్లో హీరో సీడీ డీలక్స్, హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ రెండు, యమహా ఆర్-15, హీరో గ్లామర్ రెండు, హోండా గ్లామర్, హీరో సూపర్ స్ప్లెండర్ మోటార్ సైకిళ్లు ఉన్నాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.నిందితుడిని చట్టపరమైన నిబంధనల ప్రకారం అరెస్ట్ చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసును సమర్థవంతంగా ఛేదించి చోరీకి గురైన వాహనాలను స్వాధీనం చేసుకున్న నరసరావుపేట 1 వ పట్టణ సీఐ ఎస్.కె.టి. ఫిరోజ్, ఎస్‌ఐ పి. వంశీకృష్ణతో పాటు పోలీసు సిబ్బంది బి. మురళీకృష్ణ, ఎం. రాము తదితరులను పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు అభినందించారు.






