Anchor Shyamala : నన్ను పార్టీ నుంచి దూరం చేయాలనుకుంటే.. రూమర్లపై స్పందించిన యాంకర్ శ్యామల

by Ramesh Naini |   (  Updated:2026-05-11 12:09:17  IST  )

వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ ఆరె శ్యామల తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న పుకార్లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Anchor Shyamala : నన్ను పార్టీ నుంచి దూరం చేయాలనుకుంటే.. రూమర్లపై స్పందించిన యాంకర్ శ్యామల
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ ఆరె శ్యామల తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న పుకార్లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీలో ఆమె ప్రాధాన్యత తగ్గుతోందని, ఆమెకు ‘కౌంట్‌డౌన్’ మొదలైందంటూ జరుగుతున్న ప్రచారంపై సోమవారం సోషల్ మీడియా వేదికగా ఆమె ఘాటుగా స్పందించారు. తనను పార్టీ నుంచి దూరం చేయాలనుకుంటే అది పుకార్లు, కుట్రల వల్ల కాదని.. తనను దూరం చేయడం ఎవరి వల్లా సాధ్యం కాదని ఆమె తేల్చి చెప్పారు.

పదవుల కోసం రాలేదు..

చీకట్లో ఉంటూ తనపై దుష్ప్రచారం చేస్తున్న వారికి శ్యామల గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘నేను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో, ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవడానికే వచ్చాను. ఆ ప్రేమ ఉన్నంత వరకు నన్నెవరూ ఆపలేరు’ అని స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రయాణం ఎవరి దయాదాక్షిణ్యాలతోనో మొదలు కాలేదని, తన స్వరం, నిబద్ధత, జగనన్న పక్షాన నిలబడే ధైర్యం, ఆయన తనపై ఉంచిన నమ్మకమే తన అసలైన బలం అని పేర్కొన్నారు.

తాడేపల్లిలో పొగ.. కొందరి కడుపుమంటే!

తాడేపల్లిలో ‘పొగ’ కనిపిస్తోందంటూ కథనాలు రాస్తున్న వారిని ఉద్దేశించి ఆమె చురకలు అంటించారు. పొగ ఎక్కువగా వస్తుందంటే.. అది కొందరి కడుపుమంటకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. రోజూ తనపై ఎన్ని కథలు రాసినా.. వైఎస్ జగన్ కలలు కన్న ఆంధ్రప్రదేశ్ దిశగా తాను అడుగులు వేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. తనను సైలెంట్ చేయాలని చూసే ప్రతి ప్రయత్నం.. తన గళాన్ని మరింత గట్టిగా మారుస్తుందని హెచ్చరించారు.

నమ్మకమే నన్ను నిలబెడుతోంది..

తనను తగ్గించాలనుకునే వారు చాలా మంది ఉన్నప్పటికీ, వైఎస్ జగన్ నమ్మకం, కోట్లాది ప్రజల ప్రేమే తనను నిలబెడుతున్నాయని శ్యామల పేర్కొన్నారు. ‘ఇది నా కౌంట్‌డౌన్ కాదు.. నా స్వరానికి, నా పోరాటానికి మరింత బలంగా మొదలైన స్టార్ట్’ అని తనదైన శైలిలో విమర్శకులకు సమాధానం ఇచ్చారు.

Next Story