జిల్లాలో 36 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా.. త్వరలోనే అసలు చిట్టా బయటికి?

by Naga Rani Yarlagadda |

గుంటూరు జిల్లాలో భారీగా ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. కబ్జాకు గురైన భూమి విలువ అక్షరాలా రూ.50 కోట్లు ఉంటుందని సమాచారం.

జిల్లాలో 36 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా.. త్వరలోనే అసలు చిట్టా బయటికి?
X

దిశ, గుంటూరు ప్రతినిధి/ చేబ్రోలు : గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని శేకూరు, శలపాడు గ్రామాలలో 36 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన లోతైన వివరాలను కలెక్టర్ కార్యాలయం లేదా చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం నుంచి సేకరించే పనిలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. చేబ్రోలు తహసీల్ధార్ శ్రీనివాస శర్మ ఈ మేరకు తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. ఆక్రమణకు గురైన భూమి విలువ సుమారు 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇటీవల అసెంబ్లీలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. పెదకాకాని మండలం అనమర్లపూడి గ్రామంలో దళితులకు చెందిన 50 ఎకరాల అసైన్డ్ భూమిని గత ప్రభుత్వంలో పొన్నూరు వైసీపీ నాయకుల ఒత్తిడి, బెదిరింపులతో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు సభ దృష్టికి తెచ్చారు. దీనిని బట్టి చూస్తే నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయో, ఎవరెవరు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకుని భూములను అనుభవిస్తున్నారో చిట్టా అంతా బయటకు తీస్తున్నట్లు తెలుస్తుంది. శేకూరు, శలపాడు గ్రామాలలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని అధికారులు రక్షించి, అక్రమార్కులపై చర్యలు తీసుకుంటే, ఒక సంచలనమవుతుందనడంలో సందేహం లేదు.

Next Story