గుంటూరు వేదికగా 'ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ సమ్మిట్ - 2026'

by Thanuru Gopichand |

ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రతిష్టాత్మక కార్యక్రమం.

గుంటూరు వేదికగా ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ సమ్మిట్ - 2026
X

దిశ, వెబ్ డెస్క్ : గుంటూరులోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయం (Guntur Vignan University) మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వేదిక కానుంది. ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ సమ్మిట్ - 2026 (AP Space Tech Summit - 2026) నిర్వహణకు సర్వం సిద్ధమైంది. అందుకు సంబంధించిన బ్రోచర్ ను ఇన్చార్జి వీసీ కృష్ణకిషోర్, వర్సిటీ అధికారులు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి 22 నుంచి 24 వరకు మూడు రోజులపాటు సమ్మిట్ జరగనుందన్నారు. ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ అకాడమీ (APSA), విజ్ఞాన్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. "వికసిత్ భారత్ 2047" లక్ష్య సాధనలో అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సదస్సు సాగనుందన్నారు. ఇది అంతరిక్ష రంగంలో రాష్ట్రం సాధించబోయే ప్రగతికి ఒక కీలక మైలురాయిగా నిలవనుందని ధీమా వ్యక్తం చేశారు.

​ఈ సదస్సులో భాగంగా అంతరిక్ష రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొని రాకెట్ ప్రొపల్షన్, శాటిలైట్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక అంశాలపై చర్చించనున్నారని వెల్లడించారు. ముఖ్యంగా విద్యార్థుల్లో వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించేందుకు 'సౌత్ ఇండియా రాకెట్రీ ఛాలెంజ్-2K26' పేరుతో ప్రత్యేక పోటీలను నిర్వహిస్తున్నామని ప్రకటించారు. పాఠశాల విద్యార్థుల కోసం హైడ్రో రాకెట్రీ, ఉన్నత విద్యా సంస్థల విద్యార్థుల కోసం కెమికల్ రాకెట్రీ పోటీలను ఇస్రో (ISRO) గుర్తింపు పొందిన సంస్థల పర్యవేక్షణలో జరగనున్నాయని తెలియజేశారు.

​ఆంధ్రప్రదేశ్‌ను అంతరిక్ష సాంకేతిక హబ్‌గా తీర్చిదిద్దడమే ఈ సమ్మిట్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. స్టార్టప్‌లు, పరిశోధకులు, విద్యావేత్తల మధ్య సమన్వయాన్ని పెంచడం ద్వారా కొత్త ఆవిష్కరణలకు ఈ వేదిక బాటలు వేయనుందన్నారు. విజ్ఞాన్ వర్సిటీలో జరుగుతున్న ఈ భారీ కార్యక్రమంలో దక్షిణ భారతదేశం నలుమూలల నుంచి సుమారు వేల సంఖ్యలో విద్యార్థులు, ప్రతినిధులు పాల్గొంటారని అంచనా వేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలోని యువతకు అంతరిక్ష పరిశోధనల పట్ల ఆసక్తిని కలిగించడమే కాకుండా, భవిష్యత్ అంతరిక్ష అవసరాలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించనుందని తెలిపారు.

Next Story