జగన్‌ను కలిసేందుకు వచ్చేవారిని ఎవ్వరూ ఆపలేరు : గుడివాడ అమర్నాథ్

by Naga Rani Yarlagadda |

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈనెల 9వ తేదీన మాకవరపాలెంలో చేపట్టనున్న పర్యటన రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది.

జగన్‌ను కలిసేందుకు వచ్చేవారిని ఎవ్వరూ ఆపలేరు : గుడివాడ అమర్నాథ్
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈనెల 9వ తేదీన మాకవరపాలెంలో చేపట్టనున్న పర్యటన రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. జగన్ కు రోడ్డు పర్యటనకు అనుమతి నిరాకరిస్తూ పోలీసులు ప్రకటన విడుదల చేయగా.. హెలికాప్టర్లోనే రావాలనడం వెనుక ఏదో కుట్ర ఉందని వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ నుంచి నర్సీపట్నం సమీపంలో ఉన్న మాకవరపాలెం మెడికల్ కాలేజీ ని సందర్శించేందుకు రోడ్డుమార్గంలో వెళ్లాలని ప్లాన్ చేయగా.. పోలీసులు ఆంక్షలు విధించడం వివాదానికి దారితీసింది.

అక్టోబర్ 9న ఉదయం 10 గంటలకు జగన్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి మెడికల్ కాలేజీకి రోడ్డు మార్గంలో వెళ్లాలని షెడ్యూల్ చేసుకున్నారు. కానీ.. అదేరోజున విశాఖలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఉండటంతో పోలీసులంతా అక్కడ భద్రతలో ఉంటారని, ట్రాఫిక్ సమస్యలు కూడా వస్తాయని విశాఖ సీపీ బాగ్చీ తెలిపారు. పోలీసుల నిర్ణయంపై మాజీ మంత్రి, వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము జగన్ పర్యటనకు అనుమతి అడగలేదని, కేవలం పర్యటనకు భద్రతా ఏర్పాట్లు మాత్రమే చేయాలని అడిగినట్లు చెప్పారు. గతంలో నెల్లూరు పర్యటనకు వెళ్లిన సమయంలో మూడుసార్లు హెలిప్యాడ్ అనుమతులు నిరాకరించిన విషయాన్ని ప్రస్తావించారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు, బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు తమ సమస్యల్ని జగన్ కు చెప్పుకునేందుకు వస్తారనే ప్రభుత్వం ఈ ఆంక్షల డ్రామాకు తెరలేపిందని ఆరోపించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా జగన్ ను కలిసేందుకు వచ్చేవారిని ఆపలేరన్నారు.

Next Story