- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పల్నాడులో గ్రానైట్ మాఫియా.. ప్రభుత్వ ఖజానాకు గండి
పల్నాడు జిల్లా మీదుగా తెలంగాణాకు గ్రానైట్ అక్రమ రవాణా యథేచ్చగా సాగుతుంది. మైనింగ్ రాయల్టీ వసూలు చేసుకొనే అధికారిక కాంట్రాక్టర్ ఉన్నా ఈ తతంగం జరుగుతుండటం విశేషం.

దిశ, ప్రతినిధి నరసరావుపేట: పల్నాడు జిల్లా మీదుగా తెలంగాణాకు గ్రానైట్ అక్రమ రవాణా యథేచ్చగా సాగుతుంది. మైనింగ్ రాయల్టీ వసూలు చేసుకొనే అధికారిక కాంట్రాక్టర్ ఉన్నా ఈ తతంగం జరుగుతుండటం విశేషం. వైసీపీ పాలనలో ఈ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వందల కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే పరిస్థితులలో మార్పు వస్తుందని భావించారు. కొద్ది రోజుల విరామం తరువాత యథావిధిగా ప్రారంభమైంది. ఈ అక్రమ రవాణా నడిపించేది అప్పుడు అనిల్... ఇప్పుడు అతనేనని అని గ్రానైట్ వ్యాపారులు కొందరు చెప్పుకొచ్చారు.
రాయల్టీ, జీఎస్టీ చెల్లింపుల్లేకుండా..
ప్రకాశం జిల్లాలోని మార్టూరు, సంత మాగుళూరు, బల్లికురవ, పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ పరిసరాలలో పలు గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. వీటి నుంచి వచ్చే గ్రానైట్ లారీలలో ఎక్కువగా హైదరాబాద్ కు వెళ్తుంటాయి. గ్రానైట్ ఉత్పత్తికి అడుగుకు రూ.5 చొప్పున మైనింగ్ రాయల్టీ క్వారీ యజమాని చెల్లించాలి. అలాగే గ్రానైట్ రవాణా చేసే పక్షంలో 18 శాతం సెంట్రల్ జీఎస్టీ చెల్లించాలి. మైనింగ్ రాయల్టీ వసూలు చేసుకునేందుకు వైసీపీ పాలనలో ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ కాంట్రాక్ట్‌ను పొందింది. గ్రానైట్ కాకుండా మైనింగ్ శాఖ పరిధిలో ఉండే భూగర్భ వనరులన్నిటిపైనా సదరు కాంట్రాక్టర్ రాయల్టీ, సెస్ జిల్లా మొత్తంలో వసూలు చూసుకోవచ్చు. అలా కాంట్రాక్ట్ పొందిన రాయల్టీ సంస్థ టోకెన్‌లు ఇస్తుంది. కానీ, జీఎస్టీ కట్టకపోయినా గ్రానైట్ లారీలు చెక్ పోస్టులు,రాష్ట్ర సరిహద్దులు దాటి పోతున్నాయి.
టోకెన్ ఉంటే.. నో అబ్జక్షన్..
మార్టూరు, బల్లికురవ, సంతమాగులూరు కోటప్పకొండ నుంచి గ్రానైట్ లోడుతో లారీలు వయా చిలకలూరిపేట, నరసరావుపేట, నకరికల్లు, పిడుగురాళ్ల, దాచేపల్లి, పొందుగల బ్రిడ్జి మీదుగా తెలంగాణలోకి ప్రవేశిస్తాయి. ఈ మధ్యలో ఉన్న చెక్ పోస్టులలో అక్రమ రవాణా లో కీలక పాత్ర పోషించే వారు టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ చూస్తే ఆ లారీలను ఆపకూడదు. పంపించివేయాలి. ఒక లారీకి 6 నుంచి 7 వేల అడుగు గ్రానైట్ లోడ్ అవుతుంది. దాని విలువ 3 నుంచి 5 లక్షలు ఉంటుంది. దీనికి రాయల్టీ, జీఎస్టీ ఓ లారీకి సగటున ప్రభుత్వానికి 70 వేల వరకు ఆదాయం వస్తుంది. ప్రస్తుతం రోజు 50 లారీలు పల్నాడు జిల్లా గుండా రవాణా యదేచ్ఛగా సాగుతుంది. నిత్యం 30 లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం రావాలి. అయితే కొందరు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు. ఒక లారీకి టోకెన్ ఇవ్వాలంటే రూ.29 వేలు అనధికారికంగా చెల్లించి టోకెన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అందులో అన్ని శాఖలకు సంబంధించిన అధికారులకు, ఆయా ప్రాంతంలో ఉండే కొందరు నాయకులకు పంపిణీ చేస్తున్నారని సమాచారం.






