శ్రీకాళహస్తిలో ఘనంగా ఏడు గంగమ్మ జాతర

by Thanuru Gopichand |   (  Updated:2025-12-10 02:44:28  IST  )

శ్రీకాళహస్తిలో (Srikalahasthi) ఏడు గంగమ్మ జాతర (Yedu Gangamma Jathara) అంగరంగ ఘనంగా ప్రారంభమైంది. గంగమ్మ ఆలయం నుంచి మూలస్థానాలకు గంగమ్మలు అత్యంత వేడుకగా బయలుదేరి వెళ్లాయి.

శ్రీకాళహస్తిలో ఘనంగా ఏడు గంగమ్మ జాతర
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీకాళహస్తిలో (Srikalahasthi) ఏడు గంగమ్మ జాతర (Yedu Gangamma Jathara) అంగరంగ ఘనంగా ప్రారంభమైంది. గంగమ్మ ఆలయం నుంచి మూలస్థానాలకు గంగమ్మలు అత్యంత వేడుకగా బయలుదేరి వెళ్లాయి. దక్షిణ కైలాసనాథుడు కొలువులో ఏడు గంగమ్మల జాతర అత్యంత వేడుకగా సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి.. మంగళవారం అర్ధరాత్రినుంచి బుధవారం తెల్లవారుజామున వరకు గంగమ్మ ఆలయంలో గంగమ్మ మూలవిరాట్ కు విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అభిషేక సేవ అనంతరం అమ్మవారి ఎదుట మహాకుంభం వేసి మహా నైవేద్య సమర్పణ కార్యక్రమాన్ని సాంప్రదాయ పద్ధతిలో ఆలయ అర్చకులైన రజకులు నిర్వహించారు. శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి అమ్మవార్లకు సారెను సమర్పించారు.

మహా నైవేద్యం, మహాబలి నివేదించి హారతులను సమర్పించారు. గంగమ్మ నామస్మరణ చేస్తూ బలి పూజలను పెద్ద ఎత్తున నిర్వహించారు. అనంతరం రజకుల ఆధ్వర్యంలో ఏడు గంగమ్మల మట్టి ప్రతిములు పసుపు ముద్దల ప్రతిమలకు విశేష పూజలను చేసి ఏడు గంగమ్మ కమిటీలకు అందజేశారు. ఏడు గంగమ్మల కమిటీల ప్రతినిధులు తమ గంగమ్మ తీసుకొని తమ చెప్పరాల వద్దకు తీసుకువెళ్లి సంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి కొలువు తీర్చి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు.

మూల విరాట్ పూజల అనంతరం ఏడుగంగమ్మలు ఒకరి వెంట ఒకరు బయలుదేరి వారి స్థానాలలో కొలువు తీరారు. ఏడు గంగమ్మ కమిటీలు అత్యంత ఆధునిక టెక్నాలజీతో చెప్పరాల్లో అమ్మవారి దివ్య మంగళస్వరూపాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పొన్నాలమ్మ, అంకాలమ్మ భువనేశ్వరి దేవి వరకు విశేష అలంకారాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. తెల్లవారుజామున పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించడానికి తరలివచ్చి కర్పూర నీరాజనాలు పట్టుతూ కొబ్బరికాయలు కొట్టి సంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లించారు. కొందరు బలిలిచి అమ్మవారిని సంతృప్తి పరిచారు. పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన చర్యలతో బందోబస్తు నిర్వహించారు. అమ్మవారు గంగమ్మ ఆలయం నుంచి మూలస్థానాలకు అత్యంత వేడుకగా బయలుదేరి వెళ్లాయి. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూలస్థానాల్లో అమ్మవార్లు కొలువుదీరి భక్తులకు కరుణాకటాక్షాలు అనుగ్రహించునున్నారు.

Next Story