అంగన్వాడీలకు ప్రభుత్వం మంచి చేస్తోంది : మంత్రి సంధ్యారాణి

by Thanuru Gopichand |

రాష్ట్రంలోని అంగన్వాడీలకు (Anganwadi) ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి చేస్తోందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి జి.సంధ్యారాణి (Minister Sandhya Rani) అన్నారు.

అంగన్వాడీలకు ప్రభుత్వం మంచి చేస్తోంది : మంత్రి సంధ్యారాణి
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని అంగన్వాడీలకు (Anganwadi) ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి చేస్తోందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి జి.సంధ్యారాణి (Minister Sandhya Rani) అన్నారు. ఈ విషయమై మంత్రి గురువారం మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులకు ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోందని తెలిపారు. వారి అవసరాలను గుర్తించడమే కాకుండా ఒక్కొక్కటిగా వాటిని నెరవేరుస్తోందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీల సమస్యలు కనీసం వినడానికి కూడా ఎవరూ సిద్ధంగా ఉండేవారు కాదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారి దీర్ఘకాలిక డిమాండ్లలో ఒకటి, రెండు మినహా దాదాపు అన్నింటినీ నెరవేర్చిందని ఆమె ప్రకటించారు. అంగన్వాడీల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను వివరిస్తూ గ్రాట్యూటీ అమలుతో పాటు దురదృష్టవశాత్తు మరణించిన అంగన్వాడీ కార్యకర్తల కుటుంబాలకు మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చడం చారిత్రక నిర్ణయమని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఒక్కొక్క సెంటర్‌కు లక్ష రూపాయల నిధులు కేటాయించామని, ఇది కేంద్రాల రూపురేఖలను మారుస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

​అంతేకాకుండా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేలా అంగన్వాడీ ఉద్యోగులకు కొత్తగా 5జీ నెట్‌వర్క్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్లను అందజేశామని మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. ఈ చర్యలు అంగన్వాడీ కేంద్రాల నిర్వహణను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చడానికి దోహదపడతాయని అన్నారు. చంద్రన్న ప్రభుత్వం అంగన్వాడీల పట్ల అత్యంత సానుకూలంగా ఉందని, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలందరూ ప్రభుత్వం అందిస్తున్న ఈ మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకుని, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి పూర్తి సహకారాన్ని అందించాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రభుత్వం భవిష్యత్తులో కూడా అంగన్వాడీల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చారు.

Next Story