- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గూగుల్ రాక ఏపీకి గేమ్ ఛేంజర్ : డేటా గేట్‌వేగా విశాఖ: సీఎం చంద్రబాబు

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదొక మరచిపోలేని రోజని, గూగుల్ సంస్థ రాకతో రాష్ట్ర భవిష్యత్తు పూర్తిగా మారిపోబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం జరిగిన సభలో ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు.
భారత గ్రోత్ ఇంజిన్‌గా గూగుల్
ఒకప్పుడు కేవలం సెర్చ్ ఇంజిన్‌గా ప్రయాణం మొదలుపెట్టిన గూగుల్, నేడు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్‌గా మారబోతోంది అని చంద్రబాబు కొనియాడారు. గూగుల్‌తో పాటు పోర్టుల రంగంలో దిగ్గజ సంస్థ అదానీ, కమ్యూనికేషన్ రంగంలో అగ్రగామి ఎయిర్‌టెల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. నిరంతరం కొత్త ఆలోచనలు చేసే ఈ మూడు సంస్థల రాక ఏపీకి ఒక 'గేమ్ ఛేంజర్' అని ఆయన అభివర్ణించారు.
అంతర్జాతీయ డేటా గేట్‌వేగా విశాఖ
తర్లువాడలో ఏర్పాటు కానున్న 1 గిగావాట్ సామర్థ్యం గల ఏఐ డేటా సెంటర్ ద్వారా విశాఖ నగరం ప్రపంచ పటంలో నిలవబోతోందని సీఎం అన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం అంతర్జాతీయ డేటా గేట్‌వేగా మారుతుందని, అనకాపల్లి జిల్లా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తరహాలో పారిశ్రామికంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. "గూగుల్ ఆవిష్కరణలు - ఏపీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. ఈ రెండింటి కలయిక రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది" అని వ్యాఖ్యానించారు.
2028 సెప్టెంబర్ నాటికి ఈ డేటా సెంటర్ నిర్మాణం పూర్తి కావాలని, అవసరమైతే రెండు నెలల ముందే పూర్తి చేసేందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. జూలైలో భోగాపురం ఎయిర్‌పోర్టును జాతికి అంకితం చేస్తామని, జూన్ 1న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం కానుందని వెల్లడించారు. తమ ప్రభుత్వం కేవలం MoUలకే పరిమితం కాదని, ఒప్పందాలను కార్యరూపంలోకి తెచ్చి ప్రారంభించడంలో కూడా ముందుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.






