నెల్లూరు ప్రజానీకానికి గుడ్ న్యూస్.. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

నెల్లూరు జిల్లా ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది.

నెల్లూరు ప్రజానీకానికి గుడ్ న్యూస్.. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు జిల్లా ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. గూడూరు నియోజకవర్గంతో పాటు కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వాగతించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సీఎం చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల మన్ననలు పొందారని సోమిరెడ్డి పేర్కొన్నారు. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపడంతో పాటు మూడు మండలాలను ఇక్కడే కొనసాగించాలనే ప్రభుత్వ ఆలోచన ప్రజల్లో ఆనందాన్ని నింపిందన్నారు.

ఈ నిర్ణయం గూడూరు ప్రజలకు, అక్కడి ఎమ్మెల్యే సునీల్ కుమార్‌కు మాత్రమే కాకుండా, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించిందని ఆయన తెలిపారు. మొదటి నుంచి ప్రజల నుంచి వస్తున్న వినతులు, అభిప్రాయాలను కూటమి ప్రభుత్వం గౌరవించినట్లుగా ఈ నిర్ణయం స్పష్టం చేస్తోందన్నారు.2024 ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ బాబు జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేసినట్టయిందని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో జరిగిన అస్తవ్యస్త జిల్లా విభజన కారణంగా నెల్లూరు ప్రజలు శ్రీ సిటీ, షార్, పులికాట్ సరస్సు, మేనకూరు సెజ్, వెంకటగిరి పోలేరమ్మ, సూళ్లూరుపేట చెంగాళమ్మ దేవస్థానాలను కోల్పోయారని గుర్తుచేశారు.

అదే సమయంలో, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కందుకూరును ప్రకాశం జిల్లాలో కలుపుతుండటంతో రామాయపట్నం పోర్టును కోల్పోతున్న పరిస్థితి నెల్లూరు ప్రజల్లో ఆందోళనకు దారి తీసిందన్నారు. ఇలాంటి తరుణంలో గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపడంతో పాటు కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను ఇక్కడే కొనసాగించాలనే నిర్ణయం ప్రజలకు పెద్ద ఊరటనిచ్చిందని చెప్పారు. మొత్తంగా ఈ నిర్ణయంతో నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు నాయుడికి రుణపడి ఉంటారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ట్వీట్ ఇదే..

Next Story