- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజధాని రైతులకు శుభవార్త: రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం!
రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణానికి భూములిచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణానికి భూములిచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా రిటర్నబుల్ ప్లాట్ల (Returnable Plots) రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రకటన చేశారు. రాజధాని ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని మంత్రి నారాయణ తెలిపారు. లంక భూములిచ్చిన రైతులు కూడా తమ రిటర్నబుల్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు. ఈ అంశంపై నెలకొన్న సమస్య పరిష్కారమైందని అన్నారు. ఆయా గ్రామాలకు సంబంధించిన యూనిట్ ఆఫీసుల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకునే సౌకర్యం కల్పించినట్లు మంత్రి వెల్లడించారు. రైతులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని సూచించారు.
రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భూములిచ్చిన ప్రతి రైతుకూ ప్రభుత్వం న్యాయం చేస్తుందని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు. గతంలో అసైన్డ్ భూములిచ్చిన రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లపై ఉన్న 'అసైన్డ్' అనే పదాన్ని తొలగించి, వాటిని పట్టా భూములుగా పరిగణించేలా ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ నిర్ణయంతో రైతులు తమ ప్లాట్లను దర్జాగా అమ్ముకునేందుకు, లేదా ఇతర లావాదేవీలు నిర్వహించుకునేందుకు మార్గం సుగమమైందన్నారు. రాజధాని రైతుల సమస్యలన్నీ ఆరు నెలల్లోగా పరిష్కరిస్తామని ఇటీవల ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మిగిలిన 719 మంది రైతులకు కూడా త్వరలో ప్లాట్లు కేటాయించి, రాబోయే నాలుగు నెలల్లోగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణ పనులతో పాటు రైతులకు సంబంధించిన పెండింగ్ పనులన్నింటినీ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు, ముఖ్యంగా విమానాశ్రయం, రైల్వే స్టేషన్, స్పోర్ట్స్ సిటీ వంటి భారీ ప్రాజెక్టుల కోసం రెండో విడత భూసమీకరణ (Land Pooling) తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం స్పష్టం చేశారు. రాజధాని ప్రాంత రైతులతో సచివాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రాజధాని అభివృద్ధికి ప్రస్తుతం ఉన్న భూమి సరిపోదని, పెట్టుబడులకు, ముఖ్య మౌలిక వసతుల కల్పనకు అదనంగా భూమి అవసరమని ముఖ్యమంత్రి తెలిపారు.






