ప్రాజెక్టుకు అనుకూలమే కానీ పేలుళ్లతోనే సమస్య

by Thanuru Gopichand |

పాయకరావుపేటలోని దుర్గానగర్ ప్రాంతంలో జరుగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ప్రాజెక్టుకు అనుకూలమే కానీ పేలుళ్లతోనే సమస్య
X

దిశ, వెబ్ డెస్క్ : పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పనుల నేపథ్యంలో పాయకరావుపేటలోని దుర్గానగర్ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అభివృద్ధి పేరుతో సాగుతున్న ఈ ప్రాజెక్టుకు స్థానిక ప్రజలు పూర్తి మద్దతు తెలుపుతున్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పేలుళ్లు ఆందోళనకు గురి చేస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా నివాస గృహాలకు కేవలం 50 మీటర్ల లోపే భారీ పేలుళ్లు (Blastings) జరపడం వల్ల ఇళ్లు దెబ్బతింటున్నాయని, ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు తమ లాభాల కోసం రక్షణ చర్యలను గాలికి వదిలేసి, పేద ప్రజల ప్రాణాలతో ఆడుకోవడంపై తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

​చట్టపరంగా చూస్తే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) నిబంధనల ప్రకారం జనసాంద్రత ఉన్న ప్రాంతాలకు 200 మీటర్ల లోపు ఎటువంటి బ్లాస్టింగ్ పనులు చేపట్టకూడదు. అలాగే DGMS రెగ్యులేషన్ 164 ప్రకారం 500 మీటర్ల పరిధిలో పనులు నిర్వహించాలంటే రీజినల్ ఇన్‌స్పెక్టర్ నుంచి రాతపూర్వక అనుమతి తప్పనిసరి. కానీ దుర్గానగర్‌లో ఇవేమీ అమలు కావడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాళ్లు ఎగరకుండా వాడాల్సిన వైర్ మెష్, ఇసుక బస్తాలు (Muffling) వంటి కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని అంటున్నారు. కనీసం ముందస్తు హెచ్చరిక సైరన్లు కూడా ఊదడం లేదని ప్రజలు వాపోతున్నారు. వైబ్రేషన్ స్థాయిని కొలిచే సీస్మోగ్రాఫ్‌లు కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హమని పేర్కొంటున్నారు.

​ఈ ప్రమాదకర పద్ధతులకు బదులుగా హైడ్రాలిక్ స్ప్లిట్టర్స్ లేదా డెక్స్‌పాన్ వంటి కెమికల్ ఏజెంట్లను వాడితే ఎటువంటి శబ్దం, ప్రకంపనలు లేకుండా రాయిని తొలగించవచ్చని అభిప్రాయపడుతున్నారు. కానీ కాంట్రాక్టర్లు తక్కువ ఖర్చుతో పనులు ముగించేందుకు పేలుడు పదార్థాలను వాడుతున్నారని.. తద్వారా ఆర్టికల్ 21 కల్పించిన 'జీవించే హక్కు'ను కాలరాస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్న అధికారులపై, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా హితాన్ని కాదని కేవలం లాభమే పరమావధిగా సాగుతున్న ఈ పనులపై ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

Next Story