అత్యుత్తమ మోడల్‌తో మంగళగిరి జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కు : నారా లోకేష్

by Naga Rani Yarlagadda |

మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కును దేశంలోనే ఆదర్శంగా ఉండే విధంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

అత్యుత్తమ మోడల్‌తో మంగళగిరి జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కు : నారా లోకేష్
X

దిశ, వెబ్‌డెస్క్: మంగళగిరి (Mangalagiri)లో జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కును దేశంలోనే ఆదర్శంగా ఉండే విధంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. పార్కు ఏర్పాటుపై అధికారులు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.

మంగళగిరిలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో కామన్ ఫెసిలిటీ సెంటర్ (CFC) నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రపంచ స్థాయిలో ఆభరణాల తయారీకి అవసరమైన శిక్షణను అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. దేశంలో ప్రముఖంగా ఉన్న టాప్ 20 జ్యుయలరీ తయారీ సంస్థలు ఈ పార్కులో తయారీ యూనిట్లు, రిటైల్ షాపులు ఏర్పాటు చేసుకునేలా అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు.

ఉడిపిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెమ్స్ అండ్ జ్యుయలరీ (IIGJ) పని తీరును అధ్యయనం చేసి, అదే నమూనాలో మంగళగిరి పార్కును (Mangalagiri Park) అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. స్కిల్ డెవలప్‌మెంట్ సీఈవో గణేశ్ కుమార్ స్పందిస్తూ.. త్వరలో పార్కులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CEO), కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటవుతాయని, వీటి ద్వారా ప్రతీ ఏడాదీ నాలుగు వేల మందికి ఆధునిక ఆభరణాల తయారీపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పార్కులో ఇండస్ట్రియల్ జోన్, కమర్షియల్ అండ్ రిటైల్ జోన్, మ్యానుఫాక్చరింగ్ జోన్, రెసిడెన్షియల్ జోన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ జోన్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

ఇక యువత నైపుణ్య అభివృద్ధి కోసం మోడల్ కెరీర్ సెంటర్ (ఎంసీసీ)ని మంగళగిరిలో త్వరగా ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. ఎంసీసీ ద్వారా కెరీర్ కోచింగ్, జాబ్ మ్యాచింగ్, స్కిల్ అప్‌గ్రేడేషన్, ఎంప్లాయర్ ఎంగేజ్‌మెంట్ వంటి సేవలు అందించాలన్నారు. ఇప్పటివరకు జరిగిన మూడుసార్ల జాబ్ ఫెయిర్లలో 1,170 మంది యువత పాల్గొనగా, 453 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన లోకేశ్, ప్రతి నెలా జాబ్ ఫెయిర్ నిర్వహించాల్సిందిగా ఆదేశిస్తూ, యువతకు శాతానికి శాతం ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

Next Story